వైసీపీ నేత పీవీపీ స్వాగత ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

15-03-2019 Fri 12:56
  • పార్టీలో చేరాక తొలిసారి రావడంతో భారీ ఏర్పాట్లు
  • జగ్గయ్యపేట నుంచి ర్యాలీగా బయలుదేరిన శ్రేణులు
  • అనుమతి లేదంటూ అడ్డుకున్న పోలీసులు

ఇటీవలే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్‌(పీవీపీ)కు జగ్గయ్యపేటలో చేదు అనుభవం ఎదురైంది. పార్టీలో చేరిన తర్వాత తొలిసారి పీవీపీ జిల్లాకు విచ్చేస్తుండడంతో పార్టీ శ్రేణులు భారీ స్వాగత ఏర్పాట్లు చేశాయి. ఆయన విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతుండడంతో కోలాహలం నెలకొంది. ఈ క్రమంలో జగ్గయ్యపేట నుంచి బయలుదేరిన ర్యాలీని స్థానిక పోలీసులు అడ్డుకుని 20 కార్లు సీజ్‌ చేశారు. ర్యాలీకి ఎటువంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ పొట్లూరి వరప్రసాద్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే ఉదయభాను చిల్లకల్లు పోలీస్‌ స్టేషన్‌ ముందు బైఠాయించారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది.