Telugudesam: టీడీపీలో కింజరాపు కుటుంబం ప్రత్యేకత.. నలుగురికి టికెట్లు!

  • ఎర్రన్నాయుడు కొడుకు, కూతురికి ఛాన్స్‌
  • సోదరుడు అచ్చెన్నాయుడుకు అవకాశం
  • వియ్యంకుడు బండారుకు కూడా పోటీచేసే అవకాశం

తెలుగుదేశం పార్టీకి తొలి నుంచి విధేయులైన కింజరాపు కుటుంబానికి పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రానున్న ఎన్నికల్లోనూ అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పటికే ముగ్గురికి టికెట్లు ప్రకటించగా, మరొకరికి కచ్చితంగా టికెట్టు ఇచ్చే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కింజరాపు ఎర్రన్నాయుడు కుటుంబం మొదటి నుంచి టీడీపీకి వీరవిధేయులుగా ఉంటున్న విషయం తెలిసిందే. ఎర్రన్నాయుడు బతికి ఉన్నన్నాళ్లు టీడీపీ ఉత్తరాంధ్ర రాజకీయాలు ఆయన కనుసన్నల్లోనే నడిచేవి. ఆయన మరణం తర్వాత ఈ బాధ్యతలు ఆయన సోదరుడు అచ్చెన్నాయుడు, కొడుకు రామ్మోహన్‌నాయుడు వహిస్తున్నారు. ప్రస్తుతం రామ్మోహన్‌నాయుడు శ్రీకాకుళం ఎంపీ  కాగా, అచ్చెన్నాయుడు చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేస్తున్నారు.

ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో శ్రీకాకుళం నుంచి మరోసారి రామ్మోహన్‌నాయుడు అభ్యర్తిత్వాన్ని ప్రకటించారు. గురువారం చంద్రబాబు ప్రకటించిన అసెంబ్లీ టికెట్ల జాబితాలో అచ్చెన్నాయుడుకు టెక్కలి, ఎర్రన్నాయుడు కుమార్తె భవానీకి రాజమండ్రి అర్బన్‌ టికెట్టు కేటాయించారు. భవానీ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదిరెడ్డి అప్పారావు కోడలు. దీంతో ఇప్పటి వరకు ఈ కుటుంబంలో ముగ్గురికి టికెట్లు కేటాయించినట్టయింది.

ఇక, ఎర్రన్నాయుడు వియ్యంకుడు, రామ్మోహన్‌నాయుడుకు పిల్లనిచ్చిన బండారు సత్యనారాయణమూర్తి పెందుర్తి సిట్టింగ్‌ ఎమ్మెల్యే. తొలి జాబితాలో ఆయన పేరు ప్రకటించనప్పటికీ ఆయన టికెట్టు కూడా దాదాపు ఖరారనే భావించవచ్చు. దీంతో ఒకే కుటుంబంలో నలుగురికి టికెట్లు ఇచ్చి చంద్రబాబు పార్టీని నమ్ముకున్న వారికి ప్రాధాన్యత ఇచ్చినట్టు రుజువు చేశారు.

More Telugu News