New zealand: సోషల్ మీడియా ద్వారా కాల్పులను ప్రత్యక్ష ప్రసారం చేసిన దుండగుడు.. నిమిషాలపాటు ఆగకుండా మోగిన తుపాకి!

  • ఆర్మీ డ్రెస్‌లో లోపలికి ప్రవేశించిన దుండగుడు
  • వస్తూనే సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్
  • కారునిండా మారణాయుధాలు, పేలుడు పదార్థాలు

న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లోని మసీదులో కాల్పులకు తెగబడిన సాయుధుడు కాల్పుల ఘటనను సోషల్ మీడియా ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. దుండగుడు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో పలువురు మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. మసీదులో మృతదేహాలు చెల్లాచెదరుగా పడి ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.

స్థానిక మీడియా కథనాల ప్రకారం.. దుండగుడు మసీదులోకి వెళ్లడానికి ముందే సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమ్ ప్రారంభించాడు. కారులో మసీదుకు చేరుకున్న నిందితుడు కారును బయట పార్క్ చేసి లోపలికి ప్రవేశించాడు. అతడి కారులో మారణాయుధాలు, పేలుడు పదార్థాలు, పెట్రోలు కేన్లు ఉన్నట్టు న్యూజిలాండ్ హెరాల్డ్ పేర్కొంది.

సాయుధుడు మసీదులోకి వెళ్లిన వెంటనే విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడని పత్రిక పేర్కొంది. 15 నిమిషాలపాటు కొనసాగిన లైవ్ స్ట్రీమింగ్‌లో ఈ మొత్తం వ్యవహారం రికార్డు అయిందని పేర్కొంది. అయితే, ఇందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయవద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

అల్ నూర్ మాస్క్‌లోకి ఆర్మీ దుస్తులు ధరించిన వ్యక్తి ఆటోమెటిక్ రైఫిల్ పట్టుకుని లోపలికి వెళ్లడం తాను చూశానని, అతడు లోపలికి వెళ్లిన వెంటనే తుపాకి ఆగకుండా మోగిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ఆ సమయంలో మసీదు ఆవరణలో ఉన్న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సభ్యులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు.

More Telugu News