హమ్మయ్య.. ఎట్టకేలకు నేడు వేతనాలు అందుకోనున్న బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు

15-03-2019 Fri 09:10
  • వేతనాలు అందక ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు
  • నేడు విడుదల చేస్తామన్న బీఎస్ఎన్ఎల్ ఎండీ
  • హర్షం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఎట్టకేలకు ఉద్యోగులకు ఊరటనిచ్చే చర్యలు చేపట్టింది. పెండింగ్‌లో ఉన్న ఫిబ్రవరి నెల జీతాలను నేడు విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాస్తవ ప్రకటించారు. వేతనాల విషయంలో సమయానికి స్పందించారంటూ టెలికం మంత్రి మనోజ్ సిన్హాను ప్రశంసించారు.

కాగా, మార్చి నెలలో రూ.2,700 కోట్ల వరకు వసూళ్లు రానున్నాయని, అందులో రూ.850 కోట్లను వేతనాల కోసం ఉపయోగించనున్నట్టు శ్రీవాస్తవ తెలిపారు. కాగా, వేతనాలు ఆగిపోవడంతో తన పిల్లలకు ఆహారాన్ని కూడా సరిగా అందించలేకపోతున్నానంటూ ఓ ఉద్యోగి చేసిన వ్యాఖ్యల వీడియో గురువారం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేసింది. ఈ నేపథ్యంలో వేతనాల విడుదల గొప్ప ఊరటేనని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.