Andhra Pradesh: సత్తెనపల్లి టికెట్ పై మొదలైన రగడ.. జగన్ తో బత్తుల బ్రహ్మానందం రెడ్డి భేటీ!

  • అంబటి రాంబాబుకు ఇవ్వొద్దని విజ్ఞప్తి
  • స్థానికంగా అంబటికి వ్యతిరేకత ఉందని వ్యాఖ్య
  • జగన్ ఇంటిముందు గోవర్ధన్ రెడ్డి గ్రూపు ఆందోళన

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ పార్టీల్లోకి వలసలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల్లోని అసమ్మతి నేతలు సిట్టింగ్ అభ్యర్థులకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపిస్తున్నారు. తాజాగా సత్తెనపల్లి వైసీపీ నేత బత్తుల బ్రహ్మానందం రెడ్డి ఈరోజు పార్టీ అధినేత జగన్ ను కలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబును పోటీకి దించవద్దని విజ్ఞప్తి చేశారు.

ఆయనపై స్థానికంగా వ్యతిరేకత ఉందని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. అంబటి తప్ప ఎవరు పోటీచేసినా పార్టీ విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. కాగా, ఈ విషయంలో జగన్ ఏం చెప్పారన్నది తెలియరాలేదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి టీడీపీ తరఫున స్పీకర్ కోడెల శివప్రసాద్ పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతికి ఈసారి బాపట్ల టికెట్ ఇవ్వరాదని మాజీ ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి వర్గీయులు ఈరోజు హైదరాబాద్ లోని జగన్ నివాసం ముందు ఆందోళనకు దిగారు.

More Telugu News