modi: మోదీ బలహీనుడు.. చైనా విషయంలో ఆయన దౌత్య విధానం ఇదే: రాహుల్ ఫైర్

  • చైనాకు వ్యతిరేకంగా మోదీ నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు
  • గుజరాత్ లో చక్కర్లు కొట్టడం, ఢిల్లీలో హత్తుకోవడం, చైనాలో మోకరిల్లడం
  • ఈ మూడే చైనా విషయంలో మోదీ దౌత్య విధానం

ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. జైషే మొహమ్మద్ చీఫ్ ను గ్లోబల్ టెర్రరిస్టుగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్రకటించకుండా చైనా అడ్డుకున్న నేపథ్యంలో, మోదీని రాహుల్ టార్గెట్ చేశారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ముందు బలహీనుడైన మోదీ మోకరిల్లుతున్నారని రాహుల్ ట్వీట్ చేశారు. భద్రతామండలిలో భారత్ కు వ్యతిరేకంగా చైనా వ్యవహరించిన తర్వాత... ఒక్క మాట కూడా మోదీ నోటి నుంచి రాలేదని విమర్శించారు.

'గుజరాత్ లో జిన్ పింగ్ తో కలసి చక్కర్లు కొట్టడం. ఢిల్లీలో ఆయనను హత్తుకోవడం. చైనాలో ఆయనకు మోకరిల్లడం. ఇదే చైనాకు సంబంధించి మోదీ దౌత్య విధానం' అంటూ రాహుల్ మండిపడ్డారు.

మసూద్ అజార్ ను గ్లోబర్ టెర్రరిస్టుగా ప్రకటించే విషయంపై భద్రతా మండలిలో నిన్న తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే, అందరూ ఊహించినట్టుగానే చివరి నిమిషంలో చైనా అడ్డుపుల్ల వేసింది. ఈ తీర్మానానికి ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు మద్దతు పలికినప్పటికీ... వీటో అధికారం ఉన్న చైనా వ్యతిరేకించడంతో, తీర్మానం మురిగిపోయింది. గత దశాబ్ద కాలంలో భద్రతా మండలిలో మసూద్ ను చైనా వెనకేసుకురావడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం.


More Telugu News