Class 7 student: లెక్కల ప్రశ్నకు సరైన 'లెక్క'గట్టిన ఏడో తరగతి విద్యార్థి.. కోట్లాదిమంది హృదయాలు దోచుకున్న విద్యార్థి సమాధానం!

  • లెక్కల ప్రశ్నలకు కుర్రాడి సమాధానం
  • చూసి కరిగిపోయిన టీచర్
  • సోషల్ మీడియాలో వైరల్

ఏడో తరగతి విద్యార్థి ఒకరు గణిత పరీక్షలో ఇచ్చిన సమాధానం కోట్లాదిమంది హృదయాలను దోచుకుంది. ఇచ్చిన లెక్క చేస్తూనే చివర్లో ఆ కుర్రాడు రాసిన సమాధానం పరీక్ష పేపర్ దిద్దిన టీచర్ మనసుకు హత్తుకుంది. దీంతో ఆమె తనకు తెలిసిన వారికి ఆ ఆన్సర్ షీట్‌ను ట్వీట్ చేసింది. అలా బయటకొచ్చిన ఆ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, ఇది ఏ స్కూలు, ఏ ప్రాంతం అన్న వివరాలు మాత్రం బయటకు రాలేదు.

ఓ మహిళ 15 నెల్లలో రూ.18 వేలు సంపాదిస్తే ఆమె నెల సంపాదన ఎంత? ఏడు నెలలకు ఎంత సంపాదిస్తుంది? రూ. 30 వేలు సంపాదించాలంటే ఎన్ని నెలలు పనిచేయాలి? అనేది ఆ ప్రశ్న. దీనికి ఆ కుర్రాడు చక్కగా సమాధానాలు రాశాడు. లెక్క పూర్తి చేసిన తర్వాత చివరల్లో ‘ది వుమన్ ఈస్ అండర్ పెయిడ్’ అని నేటి మహిళా కార్మికుల పరిస్థితికి అద్దంపట్టే వాక్యం రాశాడు. ఆ విద్యార్థి రాసిన సమాధానం చూసి మనసు కరిగిపోయిన ఆ టీచర్ తనకు తెలిసిన వ్యక్తికి ఆ ఆన్సర్ షీట్‌ను ఫొటో తీసి వాట్సాప్ చేసింది.

‘ఈ ప్రశ్నకు ఆ కుర్రాడు ఇచ్చిన సమాధానం ఇది. చివరి లైన్ చూడు. గణితానికి ఆవలకు వెళ్లి ఆ విద్యార్థి ఆలోచించాడు’ అని ఆ టీచర్ ట్వీట్‌లో పేర్కొన్నారు. అతడు దానిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయింది. ఇప్పుడా కుర్రాడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆ వయసులోనే సమాజంలో ఏ జరుగుతోందో తెలుసుకోగలిగాడని ప్రశంసిస్తున్నారు.

More Telugu News