China: మంచిదొంగ... బాధిత మహిళ ఖాతాలో జీరో బ్యాలన్స్ చూసి దోచుకున్న డబ్బు తిరిగిచ్చేశాడు!

  • చైనాలో ఘటన
  • ఏటీఎంలో మహిళను దోచుకున్న దొంగ
  • ఆమె ఖాతాలో ఇంకేమీ లేవని తెలుసుకుని విచారం

డబ్బు కోసం అడ్డమైన గడ్డీ తినే ఈ రోజుల్లో కూడా ఇలాంటి దొంగలు ఉంటారంటే ఆశ్చర్యం కలుగుతుంది! తాను దోచుకున్న మహిళ వద్ద ఇంకేమీ లేవని తెలుసుకుని ఆ డబ్బంతా తిరిగిచ్చేశాడో మంచి దొంగ. చైనాలో జరిగిందీ ఘటన. చైనాలోని గ్వాంగ్ డాంగ్ నగరంలో లీ అనే మహిళ గత నెలలో ఏటీఎంకి వెళ్లి డబ్బు డ్రా చేసింది. ఏటీఎం నుంచి 2500 యువాన్లు (భారత కరెన్సీలో రూ.26,000) తీసుకుంది.

అయితే ఇంతలో ఓ దొంగ కత్తితో ఏటీఎంలో ప్రవేశించి లీని బెదిరించి ఆ డబ్బులన్నీ తీసుకున్నాడు. అంతేకాదు, ఇంకా డబ్బు కావాలంటూ ఆమె బ్యాంక్ బ్యాలన్స్ ఎంతుందో చూశాడు. పాపం, ఆ అభాగ్యురాలి ఖాతాలో ఏమీ లేకపోవడంతో చూసి ఆ దొంగ చాలా బాధపడిపోయాడు. అతనిలో ఏ మూలో దాగిన మంచితనం మేల్కొంది. వెంటనే తాను దోచుకున్న 2500 యువాన్లను ఆమెకు తిరిగిచ్చేసి నవ్వుతూ ఏటీఎం నుంచి బయటికి వచ్చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

More Telugu News