Rahul Gandhi: నరేంద్ర మోదీ నుంచి నేను ఏం నేర్చుకున్నానంటే...: చెన్నై స్టెల్లా మేరీ కాలేజీలో రాహుల్ గాంధీ!

  • తమిళనాడులో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ
  • ఆగ్రహాన్ని తగ్గించుకోవడం మోదీ నుంచే నేర్చుకున్నా
  • విమర్శలను తిప్పికొట్టడం కూడా: రాహుల్

ప్రధాని నరేంద్ర మోదీ నుంచి తాను చాలా నేర్చుకున్నానని, ఎప్పుడు కోపంగా ఉండాలో, ఉండకూడదో ఆయన్ను చూసి తెలుసుకున్నానని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తమిళనాడుకు వచ్చిన ఆయన, ప్రముఖ స్టెల్లామేరీ కాలేజీ విద్యార్థినులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2014లో తాను యువకుడిగా రాజకీయాల్లో ఉన్నానని, ఇప్పుడు కూడా యువకుడినేనని (ఈ సమయంలో అమ్మాయిలంతా పెద్దగా నవ్వుతూ చప్పట్లతో అభినందించారు) చెప్పిన ఆయన, ఐదేళ్ల నాడు మోదీని చూసి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని అన్నారు. ఆయన నాపై ఎంతో కోపంతో విమర్శలు చేసేవారని, దాన్నుంచి తాను కోప్పడకుండా వాటిని తిప్పికొట్టడం ఎలానో తెలుసుకున్నానని అన్నారు. మనకు ఏవైనా విషయాలను నేర్పించే వారిపై కోపం ఉండదని, మోదీపైనా తనకు కోపం లేదని అన్నారు.

ఎవరిపైనైనా దాడులు చేసేవారు, వేధింపులకు దిగేవారి నుంచి అమ్మాయిలు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఎలా స్పందించాలో అక్కడే తెలుస్తుందని అన్నారు. ఎంతగా దెబ్బతింటే అంతగా రాటుదేలవచ్చని అది ఏ రంగంలోనైనా వర్తిస్తుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

More Telugu News