Rahul Gandhi: రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సెక్యూరిటీ గార్డులు!

  • 'చౌకీదార్‌ చోర్‌ హై' అంటున్న రాహుల్
  • సెక్యూరిటీ గార్డులను అవమానిస్తున్నారు
  • ముంబైలో పోలీసులకు ఫిర్యాదు

ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి విమర్శలు గుప్పిస్తూ, తమ వృత్తిని అవమానించేలా రాహుల్ గాంధీ మాట్లాడారని అంటూ సెక్యూరిటీ గార్డ్ అసోసియేషన్ ముంబై పోలీసులను ఆశ్రయించింది. 'చౌకీదార్‌ చోర్‌ హై' (కాపలా వ్యక్తే దొంగ) అంటూ రాహుల్ వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టిన అసోసియేషన్, ఆయనపై కేసు నమోదు చేయాలని కోరింది.

ఈ మేరకు బాంద్రా - కుర్లా కాంపెక్స్‌ పోలీస్‌ స్టేషన్‌ లో మహారాష్ట్ర రాజ్య సురక్షా రక్షక్‌ యూనియన్‌ పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేసింది. రాహుల్ వ్యాఖ్యలు అనునిత్యమూ రక్షణగా నిలిచే సెక్యూరిటీ గార్డుల పట్ల అవమానకరంగా ఉన్నాయని వారు ఆరోపించారు. ఇటీవల ఎమ్‌ఎమ్‌ఆర్‌డీఏ మైదానంలో జరిగిన సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, 'చౌకీదార్ చోర్‌ హై' అని విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.

కాపలాదారులను అవమానించే విధంగా ఉన్న నినాదాలు ఇకపై మాట్లాడకుండా నోటీసులు ఇవ్వాలని సెక్యూరిటీ గార్డుల అసోసియేషన్ అధ్యక్షుడు సందీప్ డిమాండ్ చేశారు. కాగా, రాఫెల్ యుద్ధ విమానాల డీల్ విషయంలో అవకతవకలు జరిగాయని ప్రతి సభలోనూ ప్రస్తావిస్తున్న రాహుల్ మోదీని ఉద్దేశించి, కాపలాదారుగా ఉండాల్సిన వ్యక్తి దొంగగా మారాడని నిప్పులు చెరుగుతున్న సంగతి తెలిసిందే.

More Telugu News