వైసీపీలో చేరిన తోట నరసింహం...పారిశ్రామికవేత్త పొట్లూరి, సినీ నటుడు రాజారవీంద్ర కూడా!

13-03-2019 Wed 10:36
  • లోటస్‌పాండ్‌లో జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిన ఇద్దరు
  • సినీనటుడు రాజా రవీంద్రకు వైసీపీ తీర్థం
  • నరసింహం భార్య వాణికి పెద్దాపురం ఎమ్మెల్యే టికెట్‌
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఈరోజు ఇద్దరు ప్రముఖులు చేరారు. తెలుగుదేశం పార్టీ కాకినాడ సిటింగ్‌ ఎంపీ తోట నరసింహం ఒకరు కాగా, ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్‌ మరొకరు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తమ మనోభావాలను గౌరవించలేదన్న మనస్తాపంతో పార్టీ వీడిన నరసింహం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆయన భార్య వాణికి ఆ పార్టీ అధినేత జగన్‌ పెద్దాపురం ఎమ్మెల్యే టికెట్టు కేటాయించారు. ఇక, పీవీపీగా పారిశ్రామిక వర్గాల్లో గుర్తింపు పొందిన పొట్లూరి వరప్రసాద్‌కు విజయవాడ లోక్‌సభ స్థానం కేటాయించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

గత ఎన్నికల్లోనూ విజయవాడ టికెట్టు ఆశించిన పీవీపీకి చివరి నిమిషంలో అవకాశం దక్కలేదు. మరోనేత దాసరి జైరమేష్‌ కూడా విజయవాడ స్థానాన్ని ఆశిస్తూ ఇటీవలే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరి వీరిద్దరి విషయంలో అధిష్ఠానం ఎవరివైపు మొగ్గు చూపుతుందో చూడాలి. కాగా, తెలుగు చిత్రపరిశ్రమలో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా పలు పాత్రలతో గుర్తింపు పొందిన రాజారవీంద్ర కూడా ఈరోజు జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.