Guntur District: అప్పుడే పట్టుబడుతున్న నోట్ల కట్టలు... ఎక్కడెక్కడ ఎంతంటే..!

  • గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు
  • పలు వాహనాల నుంచి లక్షల కొద్దీ పట్టుబడ్డ డబ్బు
  • లెక్కలు చూపించి తీసుకు వెళ్లాలంటున్న పోలీసులు

ఎన్నికల షెడ్యూల్ ఇలా విడుదలైందో లేదో... అప్పుడే ఏపీలో నోట్ల కట్టలు బయట పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసిన పోలీసులు విస్తృతంగా తనిఖీలను చేస్తుండగా, అక్రమంగా తరలిస్తున్న డబ్బు పట్టుబడింది. గుంటూరు జిల్లా శివార్లలో రూ. 1,43 కోట్లు, మంగళగిరిలో రూ. 82 లక్షలు, ఉండిలో రూ. 63 లక్షలు, తెనాలిలో రూ. 2.50 లక్షలు డబ్బు తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.

గుంటూరు, అరండల్‌ పేటలో ప్రైవేటు వాహనంలో తరలిస్తున్న రూ. 1.15 కోట్లు పట్టుబడగా, అది సౌత్‌ ఇండియా బ్యాంకుకు చెందినవిగా వాహనదారులు తెలపడంతో, విచారించి అప్పగించాలంటూ నగదును ఐటీ అధికారులకు పంపారు పోలీసులు. శనక్కాయల ఫ్యాక్టరీ సెంటర్‌ సమీపంలో సుబ్బారెడ్డి అనే యువకుడి నుంచి రూ. 22 లక్షలు, పలకలూరు రోడ్డులో రూ. 4 లక్షలు పోలీసులకు పట్టుబడ్డాయి.

గురజాల నియోజకవర్గంలో వజ్రాల పెద్ద అంబిరెడ్డి అనే వ్యక్తి వద్ద రూ. 4.40 లక్షలు, మంగళగిరి, ఆర్‌ అండ్ బీ బంగ్లా వద్ద వేర్వేరు కార్లలో తరలిస్తున్న రూ. 82 లక్షలు, సుంకర శ్రీనివాసరావు అనే వ్యక్తి నుంచి రూ. 70.72 లక్షలు, మహీధర్‌ అనే వ్యక్తి నుంచి రూ. 12 లక్షలు పట్టుబడ్డాయి. ఈ నగదుకు సంబంధించి సరైన పత్రాలను ఐటీ అధికారులకు చూపించి, డబ్బు తీసుకు వెళ్లవచ్చని పోలీసులు తెలిపారు.

More Telugu News