Congress: రేవంత్ రెడ్డి రాయబారం ఫెయిల్... టీఆర్ఎస్ లో చేరేందుకు సబిత నిర్ణయం!

  • కొడుకు కోసం సంచలన నిర్ణయం
  • రాహుల్ చెప్పినా వినని వైనం
  • కేసీఆర్ నుంచి డబుల్ ధమాకా ఆఫర్!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఏదీ కలిసిరావడంలేదు. ఇటీవల ఎన్నికల్లో చావుతప్పి కన్నులొట్టబోయినంత పనైంది. చివరికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనేందుకు కూడా ఈ జాతీయ పార్టీ ధైర్యం చేయలేకపోయింది. దానికితోడు కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచినవాళ్లు కూడా టీఆర్ఎస్ లోకి వెళుతున్నారు. తాజాగా, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తన కుమారుడు కార్తీక్ కు చేవెళ్ల ఎంపీ టికెట్ ఆశిస్తున్న సబితకు కాంగ్రెస్ నుంచి స్పష్టత రాలేదు. మరోవైపు, టీఆర్ఎస్ వర్గాలు సమయం చూసి సబితకు డబుల్ ధమాకా ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం.

పార్టీలోకి వస్తే సబితకు మంత్రి పదవి, తనయుడు కార్తీక్ రెడ్డికి మరో కీలక పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతకుముందు, అసంతృప్తితో ఉన్న సబితను బుజ్జగించే బాధ్యతను రేవంత్ రెడ్డికి అప్పగించింది కాంగ్రెస్ అధిష్ఠానం. అయితే రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నాలు కూడా సబిత నిర్ణయాన్ని మార్చలేకపోయాయి. అధిష్ఠానం అభిప్రాయాలను ఆమెకు వివరించినా ఫలితం కనిపించలేదు!  అటు, రాహుల్ గాంధీ కూడా స్వయంగా ఫోన్ చేసి సబితతో మాట్లాడినట్టు వార్తలు వినిపించాయి. కానీ, ఆమె టీఆర్ఎస్ లో చేరేందుకు మొగ్గుచూపినట్టు అర్థమవుతోంది.

More Telugu News