కాంగ్రెస్ పార్టీలో చేరిన హార్దిక్ పటేల్.. గ్రామగ్రామానికి పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేస్తానని ప్రకటన

12-03-2019 Tue 19:19
  • కాంగ్రెస్‌లో చేరడం ఆనందంగా ఉంది
  • మహాత్మాగాంధీ ఇదే రోజు దిండి మార్చ్ ప్రారంభించారు
  • పోటీ విషయం అధిష్ఠానం నిర్ణయిస్తుంది
పటీదార్ రిజర్వేషన్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ నేడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. నేడు అహ్మదాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానంతరం జరిగిన ర్యాలీలో హార్దిక్.. రాహుల్‌తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే తదితరుల సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా హార్దిక్ పటేల్ మాట్లాడుతూ.. ఇదే రోజు మహాత్మాగాంధీ దిండి మార్చ్ ప్రారంభించారన్నారు. సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్ లాల్ నెహ్రూ వంటి దిగ్గజాల సారధ్యంలో ఏర్పాటైన కాంగ్రెస్ పార్టీలో చేరడం తనకు ఆనందాన్నిచ్చిందన్నారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది.. అధిష్ఠానం నిర్ణయిస్తుందని.. దానిని తాను గౌరవిస్తానని అన్నారు. గ్రామగ్రామానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లి పార్టీ పటిష్టతకు కృషి చేస్తానన్నారు.