cbi ex jd lakshmi narayana: టీడీపీలోకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. భీమిలి నుంచి బరిలోకి?

  • లక్ష్మీనారాయణ సంచలన నిర్ణయం
  • రెండు మూడు రోజుల్లో చంద్రబాబుతో భేటీ
  • తాజా పరిణామాల నేపథ్యంలో విశాఖకు మారిన లోకేశ్!

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే టీడీపీలో చేరి భీమిలి నుంచి బరిలోకి దిగాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి. లక్ష్మీనారాయణ భీమిలి నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తుండడంతో, అక్కడి నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్న మంత్రి నారా లోకేశ్ విశాఖపట్టణం ఉత్తర నియోజకవర్గానికి మారాలని నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.  

మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారి అయిన లక్ష్మీనారాయణ.. వైసీపీ చీఫ్ జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తుతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. ఇటీవల తన సర్వీస్ నుంచి స్వచ్ఛందంగా వైదొలిగిన ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ప్రకటించారు. లక్ష్మీనారాయణ ఆ ప్రకటన చేయగా ప్రధాన పార్టీలన్నీ లాక్కోవడానికి ప్రయత్నించినా ఆయన ఏ పార్టీవైపు మొగ్గు చూపలేదు.

రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించిన లక్ష్మీనారాయణ పలు సమస్యలపై అధ్యయనం చేశారు. పలు ప్రాంతాల్లో రైతులతో సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నిజానికి ఆయన సొంత పార్టీ పెట్టబోతున్నారన్న వార్తలు  వచ్చాయి. ఆ తర్వాత లోక్‌సత్తా బాధ్యతలు తీసుకున్నట్టు కూడా వార్తలు వినిపించాయి. అయితే, తాజాగా బయటకొచ్చిన వార్త మాత్రం రాజకీయాల్లో చర్చకు కారణమయ్యాయి. ఆదివారం హైదరాబాద్‌లో లక్ష్మీనారాయణ మంత్రి గంటా శ్రీనివాసరావుతో భేటీ అయ్యారు. మరో రెండు మూడు రోజుల్లోనే చంద్రబాబుతోనూ భేటీ అవుతారని తెలుస్తోంది.  

More Telugu News