Guntur District: విమాన మృతుల్లో గుంటూరు యువ వైద్యురాలు.. అక్కను చూసేందుకు వెళ్తూ మృత్యువాత

  • ఆదివారం ఇథియోపియాలో కూలిన విమానం
  • 157 మంది మృత్యువాత
  • డాక్టర్ మనీష మృతితో గుంటూరులో విషాదం

ఆదివారం ఇథియోపియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మరణించిన వారిలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన యువ వైద్యురాలు డాక్టర్ నూకవరపు మనీషా కూడా వున్నారు. ఈ ప్రమాదంలో మొత్తం 157 మంది మృతి చెందగా అందులో మొత్తం నలుగురు భారతీయులు ఉన్నారు. వారిలో మనీషా ఒకరు. ఆమె మృతి విషయం తెలిసి గుంటూరులో విషాద ఛాయలు అలముకున్నాయి.

గుంటూరు జిల్లా అమరావతి మండలం ఉంగుటూరుకు చెందిన నూకవరపు వెంకటేశ్వరరావు, భారతి దంపతుల రెండో కుమార్తె అయిన మనీషా నాలుగేళ్ల క్రితమే మెడిసిన్ పూర్తిచేశారు. అనంతరం అమెరికా వెళ్లి అక్కడే ఉంటున్నారు. కెన్యా రాజధాని నైరోబీలో ఉంటున్న మనీషా సోదరి లావణ్య పది రోజుల క్రితం ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. దీంతో వారిని చూసేందుకు మనీషా ఇథియోపియా బయలుదేరారు.  

అక్కడి నుంచి నైరోబీ వెళ్లేందుకు ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌లో విమానమెక్కారు. ఉదయం 8:38 గంటలకు అడిస్ అబాబాలోని బోలె అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్ అయిన విమానం ఆరు నిమిషాలకే రాడార్‌తో సంబంధాలు కోల్పోయింది. ఆ తర్వాత విమానం కుప్పకూలినట్టు వార్తలొచ్చాయి. టేకాఫ్ అయిన ప్రాంతానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిషోఫ్తు సమీపంలోని హెజెరెలో విమానం కూలిపోయింది.

ఈ ఘటనలో మృతి చెందిన వారిలో వివిధ దేశాలకు చెందిన మొత్తం 157 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో డాక్టర్ మనీషా సహా నలుగురు భారతీయులు ఉన్నారు. వీరిలో వైద్య పన్నగేశ్ భాస్కర్, వైద్య హన్సిన్‌ అన్నగేశ్‌, పర్యావరణశాఖ కన్సల్టెంట్‌ శిఖా గార్గ్‌ ఉన్నారు. మనీషా తల్లిదండ్రులు నెల రోజులుగా నైరోబీలోనే ఉంటున్నారు.  కుమార్తె మరణవార్తతో వారి కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.

More Telugu News