comedian ali: అలీ పొలిటికల్‌ ఎంట్రీ... చివరికి వైసీపీ కండువా వేసుకున్న హాస్యనటుడు!

  • లోటస్‌ పాండ్‌లో జగన్‌ సమక్షంలో చేరిక
  • కొన్నాళ్లుగా జగన్‌, పవన్‌, చంద్రబాబులతో వరుసగా భేటీ
  • టీడీపీలో చేరుతారని అనుకున్నా చివరికి ఫ్యాన్‌వైపే మొగ్గు

టాలీవుడ్‌ ప్రముఖ హాస్య నటుడు అలీ రాజకీయ టూర్‌కు ఎట్టకేలకు లోటస్‌పాండ్‌ వద్ద బ్రేక్‌పడింది. ఈరోజు ఉదయం ఆయన వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. లోటస్‌పాండ్‌లో జగన్‌తో భేటీ అయిన అనంతరం అలీ దాదాపు పావుగంటపాటు పలు అంశాలపై చర్చించారు. అనంతరం పార్టీ కండువా వేసి పార్టీలోకి అలీని జగన్‌ సాదరంగా ఆహ్వానించారు.

జగన్‌ ప్రజాసంకల్ప యాత్రలో ఉండగా ఆయనను కలిసి తన పొలిటికల్‌ ఎంట్రీకి సిగ్నల్స్‌ ఇచ్చిన అలీ ఆ తర్వాత పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబునాయుడుతో కూడా భేటీ అయి తన మనసులోమాటను చెప్పుకున్నారు. ఇటీవల తన సినీ ప్రస్థానం వేడుక సభకు ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించడం, ఈ సందర్భంగా మీలాంటివాళ్లు రాజకీయాల్లోకి రావాలని చంద్రబాబు అనడంతో టీడీపీలోకి అలీ వెళ్లడం ఖాయం అనుకున్నారు.

అయితే అనూహ్యంగా అలీ ఈరోజు వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో తన ప్రయత్నాలు ఎక్కడి నుంచి ప్రారంభించారో అక్కడికే చేరుకున్నట్లు అయింది. గుంటూరు నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయాలని ఆశించిన అలీ ఇటీవలే గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి తన ఓటరు నమోదు దరఖాస్తు అందించారు.

అయితే ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు టీడీపీ అధినేత నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతోనే ఆయన లోటస్‌పాండ్‌వైపు మళ్లినట్టు భావిస్తున్నారు. అలీ గుంటూరు లేదా రాజమండ్రి నుంచి వైసీపీ తరపున పోటీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలీ వెంట సినీ నటుడు కృష్ణుడు కూడా ఉన్నారు.

More Telugu News