fatf: ఇండియా స్థానంలో మరో దేశాన్ని నియమించండి: ఎఫ్ఏటీఎఫ్ కు పాకిస్థాన్ లేఖ

  • పాక్ ను బ్లాక్ లిస్ట్ లో ఉంచే విషయంపై జూన్ లో సమీక్ష
  • ఇప్పటికే పాకిస్థాన్ ను హెచ్చరించిన ఎఫ్ఏటీఎఫ్
  • కోఛైర్ గా భారత్ ఉంటే తమపై వ్యతిరేక వైఖరిని అనుసరిస్తుందన్న పాక్

ఎఫ్ఏటీఎఫ్ (ఉగ్ర సంస్థల ఆర్థిక మూలాలపై నిఘా ఉంచే ఆర్థిక చర్యల కార్యదళం)లోని ఆసియా-పసిఫిక్ జాయింట్ గ్రూప్ కోఛైర్ గా భారత్ ను తొలగించాలని పాకిస్థాన్ కోరింది. ఈ మేరకు ఎఫ్ఏటీఎఫ్ అధ్యక్షుడికి పాకిస్థాన్ ఆర్థిక మంత్రి అసద్ ఉమర్ లేఖ రాశారు. భారత్ స్థానంలో ఆసియా-పసిఫిక్ జాయింట్ గ్రూప్ కోఛైర్ గా వేరే దేశాన్ని నియమించాలని లేఖలో కోరారు.

సమీక్ష నిష్పక్షపాతంగా జరగాలనే ఉద్దేశంతోనే తాము ఈ ప్రతిపాదనను తమ ముందు ఉంచుతున్నామని తెలిపారు. పాకిస్థాన్ పై భారత్ కు ఎలాంటి వైఖరి ఉంటుందో అందరికీ తెలుసని... ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలతో పరిస్థితులు మరింత దిగజారాయని చెప్పారు. ఫిబ్రవరి 18న జరిగిన ఎఫ్ఏటీఎఫ్ సమావేశంలో పాకిస్థాన్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని భారత్ కోరిందని... ఈ నేపథ్యంలో కోఛైర్ గా భారత్ ఉంటే, పాక్ పట్ల ఆ దేశం వ్యతిరేక వైఖరిని అనుసరిస్తుందని తాము భావిస్తున్నామని తెలిపారు.

ఉగ్రవాద ఆర్థిక మూలాలను కట్టడి చేయడంలో పాకిస్థాన్ విఫలమైందని ఎఫ్ఏటీఎఫ్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అంతే కాదు... ఇప్పటికైనా పటిష్ఠ చర్యలను తీసుకోకపోతే తదుపరి సమీక్షలో బ్లాక్ లిస్ట్ లో చేర్చుతామని హెచ్చరించింది. ఈ హెచ్చరికల నేపథ్యంలోనే నిషేధిత సంస్థలపై పాకిస్థాన్ ఇటీవల చర్యలకు ఉపక్రమించింది. ఈ చర్యల ఆధారంగానే పాక్ ను గ్రే లిస్ట్ లో ఉంచాలా? లేదా బ్లాక్ లిస్ట్ పెట్టాలా? అనే అంశంపై జూన్ లో సమీక్ష జరగనుంది. ఆసియా-పసిఫిక్ కోఛైర్ గా భారత ఫైనాన్షియల్ డైరెక్టర్ జనరల్ వ్యవహరిస్తున్నారు.

More Telugu News