Hyderabad: టీఆర్ఎస్ కి ఓటేస్తే మోరీలో వేసినట్టే: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్

  • టీఆర్ఎస్ కు ఉన్న ఎంపీలు ఏం సాధించారు?
  • రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటేయొద్దు
  • వచ్చే ఎన్నికల్లో మోదీని గద్దె దింపాలి

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ కి ఓటేస్తే మోరీలో వేసినట్టేనని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. శంషాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ కు 13 మంది ఎంపీలు ఉన్నారని, వాళ్లు తెలంగాణకు సాధించిదేమీ లేదని, అందుకే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటేయొద్దని కోరారు.

ఈ ఐదేళ్లలో ప్రజలకు ఇచ్చిన మాటను ప్రధాని మోదీ నిలబెట్టుకోలేదని విమర్శించారు. ప్రతి పౌరుడి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని, రైతులకు మేలు చేస్తామని ఇచ్చిన మాటలను నిలబెట్టుకోలేదని విమర్శించారు. భారత దేశాన్ని మతపరంగా విచ్ఛిన్నం చేయాలని బీజేపీ ప్రభుత్వం కోరుకుంటోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో మోదీని గద్దె దింపి రాహుల్ ని ప్రధానిని చేయాలని ప్రజలను కోరారు.

రాహుల్ గాంధీపై నమ్మకం ఉంచండి: షబ్బీర్ అలీ

276 మంది ఎంపీలు ఎవరికి ఉంటే వారే ప్రధానమంత్రి అవుతారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. 16 మంది ఎంపీలు ఉన్నంత మాత్రాన దేశాన్ని పాలించలేరంటూ టీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. రాహుల్ గాంధీపై నమ్మకం ఉంచండి, కాంగ్రెస్ కు ఓటు వేయండి అని పిలుపు నిచ్చారు.

కేసీఆర్ కు వేసే ఓటు మోదీకి ఉపయోగపడుతుంది: భట్టి విక్రమార్క

దేశాన్ని వర్గాలుగా విభజించి పాలించాలనే యోచన బీజేపీదని, ఇటువంటి తరుణంలో దేశాభివృద్ధికి కాంగ్రెస్ పాలన అవసరమని టీ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కు వేసే ప్రతి ఓటు మోదీకి ఉపయోగపడుతుందని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

More Telugu News