Narendra Modi: మసూద్ అజహర్ ను విడిచిపెట్టింది ఎవరో మోదీ దేశ ప్రజలకు చెప్పాలి: రాహుల్ డిమాండ్

  • కరుడుగట్టిన ఉగ్రవాదిని విడిచిపెట్టింది బీజేపీనే
  • ఇప్పుడా ఉగ్రవాదే సీఆర్పీఎఫ్ జవాన్లను చంపాడు
  • నిప్పులు చెరిగిన కాంగ్రెస్ అధినేత

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై తన విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. అప్పట్లో జైషే మహ్మద్ అధినేత మసూద్ అజహర్ ను విడిచిపెట్టింది బీజేపీ ప్రభుత్వమే అని ప్రధాని మోదీ దేశ ప్రజలకు చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. కర్ణాటకలోని హవేరీలో శనివారం జరిగిన సభలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత జైలు నుంచి మసూద్ అజహర్ ను బయటికి పంపించింది ఎవరో ప్రధాని మోదీ మాకు అర్థమయ్యేట్టు చెబితే బాగుంటుంది అంటూ రాహుల్ వ్యంగ్యం ప్రదర్శించారు.

"మోదీకి నాదో చిన్న ప్రశ్న! సీఆర్పీఎఫ్ జవాన్లను చంపింది ఎవరు? జైషే మహ్మద్ అధినేత పేరేంటి?... అతడి పేరు మసూద్ అజహర్. దీని గురించి మీరు ఎందుకు మాట్లాడరు? సీఆర్పీఎఫ్ జవాన్లను బలిగొన్న వ్యక్తి గురించి మీరు ఎందుకు చెప్పడం లేదు? భారత్ లో ఉన్న ఆ వ్యక్తిని పాకిస్థాన్ కు పంపించింది బీజేపీనే కదా! మోదీ గారూ, మీ వైఖరి మాకు నచ్చలేదు. ఉగ్రవాదం ముందు మేం మోకరిల్లం. ప్రజలకు స్పష్టం చేయండి మసూద్ అజహర్ ను ఎవరు పాకిస్థాన్ కు పంపించారో" అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ అధినేత.

అంతేకాదు, ప్రస్తుతం నడుస్తున్న రాఫెల్ స్కాంలోనూ ప్రధాని మోదీపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు రాహుల్. "అవినీతి గురించి మోదీ మాట్లాడారు, కానీ దేశమంతా మోదీనే అవినీతిపరుడుని భావిస్తోంది" అంటూ విమర్శించారు. పనిలో పనిగా మోదీ మానసపుత్రికలైన కొన్ని కార్యక్రమాలపై సెటైర్ విసిరారు రాహుల్. 'మేకిన్ ఇండియా', 'స్టాండప్ ఇండియా', 'సిట్ డౌన్ ఇండియా' అంటూ మోదీ గత ఐదేళ్లుగా ప్రజలను వెర్రివాళ్లను చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

More Telugu News