Andhra Pradesh: నేను బాహుబలి సినిమా చూశాను.. అందులో కూడా ఇన్ని కుట్రలు లేవు!: ఏపీ సీఎం చంద్రబాబు సెటైర్లు

  • ఇక్కడ ఎంతమంది కావాలంటే అంతమంది విలన్లు ఉన్నారు
  • విజయసాయిరెడ్డి గత నెల 19న ఈసీకి ఫిర్యాదు చేశారు
  • అనంతరం ఫిబ్రవరి 22న తెలంగాణ పోలీసులు దాడిచేశారు

ఐటీ గ్రిడ్స్ లో డేటా చోరీ వెనుక మహాకుట్ర ఉందని ఏపీ సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. తాను చాలా సినిమాలు చూశాననీ, కానీ ఇంత కుట్రలున్న సినిమాలను ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. ఇందులో ఎంత మంది విలన్లు కావాలో అంతమంది ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇటీవల చూసిన బాహుబలి సినిమాలోనూ ఇన్ని కుట్రలు లేవని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను ప్రజల ముందు ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. ఐటీ గ్రిడ్స్ కంపెనీ డేటా చోరీ వ్యవహారంపై ఏపీ సీఎం ఈరోజు అమరావతిలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

గత నెల 19న వైసీపీ నేత విజయసాయిరెడ్డి భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ కు ఓ వినతిపత్రాన్ని అందజేశారని చంద్రబాబు తెలిపారు. ఏపీలో అక్రమంగా డిజిటల్ డేటాను టీడీపీ యాక్సస్ చేస్తోందని అందులో ఆరోపించారన్నారు. ఇది పూర్తికాగానే యాక్షన్ ప్లాన్ అమలును మొదలుపెట్టారన్నారు. 3 రోజుల తర్వాత హైదరాబాద్ లోని ఐటీ గ్రిడ్స్ సంస్థపై దాడులు నిర్వహించారని తెలిపారు. ఎలాంటి కారణం చెప్పకుండానే అశోక్ ను ప్రశ్నించి డేటాను దొంగిలించుకుని పోయారని పేర్కొన్నారు. ఇది పట్టపగలు దోపిడీ చేయడమేనని స్పష్టం చేశారు. ‘హైదరాబాద్ లో  మీ డేటా సురక్షితంగా ఉంటుంది’ అని సాఫ్ట్ వేర్ కంపెనీలకు హామీ ఇచ్చి తాను సంస్థలను తీసుకొచ్చానని చంద్రబాబు గుర్తుచేశారు.

సేవా మిత్ర యాప్, సభ్యత్వ నమోదు, ఇన్సూరెన్స్ సమాచారం, సభ్యత్వ నిధి తదితర సమాచారాన్ని దొంగిలించారని చెప్పారు. ఐటీ గ్రిడ్స్ సంస్థ అధినేత అశోక్ ఇంటిపై అర్ధరాత్రి దాడిచేశారనీ, నలుగురు ఉద్యోగులను అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి కుటుంబ సభ్యులను బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉన్నది ప్రజాస్వామ్యమా? లేక లూటీలు చేసే దోపిడీదారుల ప్రభుత్వమా? అని ప్రశ్నించారు. గత నెల 26న ‘టీడీపీ డేటాను తస్కరించింది. ఈసీ, యూఐడీఏఐల విచారణ ప్రారంభం’ అని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని ప్రచురించిందని పేర్కొన్నారు. అంటే అప్పటివరకూ ఎలాంటి ఫిర్యాదులు అందకుండానే తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్స్ డేటాను తస్కరించారని స్పష్టం చేశారు. ఇలా చేసే అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు.

More Telugu News