Balakrishna: లోకేశ్ సరే... ఆయన తోడల్లుడు భరత్ పరిస్థితేంటి?... బాలకృష్ణ నిర్ణయమే కీలకమంటున్న టీడీపీ నేతలు!

  • విశాఖ ఎంపీగా పోటీ చేసేందుకు సై అంటున్న భరత్
  • బాలకృష్ణ చిన్నల్లుడి హోదాలో గెలుపు ఖాయమంటున్న తెలుగు తమ్ముళ్లు
  • భరత్ కేంద్రంగా సాగుతున్న చర్చ

ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ స్క్రీన్ మీదకు మరో రాజకీయ వారసుడి రంగ ప్రవేశం జరుగుతోంది. అది కూడా సాదాసీదా పొలిటికల్ వారసత్వం కాదు. ఆ వారసుడే భరత్. నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు. ఏపీ మంత్రి నారా లోకేశ్ తోడల్లుడు, గీతమ్ యూనివర్శిటీ వ్యవస్థాపకుడు, దివంగత సీనియర్ నేత ఎంవీవీఎస్ మూర్తి మనవడే భరత్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. భరత్ కు ఇంకో హోదా కూడా ఉంది. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావుకు కూడా భరత్ మనవడే. పుట్టుకతోనే ఘనమైన రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఆయన, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్న ఎన్నికల ద్వారా అడుగు పెట్టనున్నారనడంలో సందేహం లేదు.

అన్నింటికీ మించి, ఆయన నందమూరి కుటుంబానికి అల్లుడు కూడా అయ్యాడు. రాజకీయాల్లోకి రావడానికి అంతకుమించిన అర్హత ఇంకోటి లేదనడంలో అతిశయోక్తి లేదు. అయితే, ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారు? అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. తన తాత ఎంవీవీఎస్ మూర్తికి ఉన్న మంచి పేరు తనకు ఉపయోగపడుతుందని భావిస్తున్న భరత్, విశాఖ నుంచి ఎంపీగా పోటీకి దిగుతానని ఇప్పటికే స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడకపోయినా, ఉత్తరాంధ్ర టీడీపీలో మూర్తికి ఉన్న మంచి పేరు భరత్ కు ఉపకరిస్తుందని టీడీపీ నేతలే స్వయంగా చెబుతున్న పరిస్థితి.

పైగా, నందమూరి ఫ్యామిలీకి ఉన్న ఇమేజ్ భరత్ కు సహకరిస్తుందని బాలయ్యే స్వయంగా తన వియ్యంకుడికి సిఫార్సు చేసినట్టు కూడా తెలుస్తోంది. ఇదిలావుండగా, నందమూరి కుటుంబంలో మూడోతరం వారసుల ప్రత్యక్ష ఎన్నికలకు రంగం సిద్ధమైన ఈ తరుణంలో భరత్ తోడల్లుడు, ఇప్పటికే ఏపీకి మంత్రిగా ఉంటూ, కాబోయే ముఖ్యమంత్రిగా తెలుగుదేశం వర్గాల మద్దతు పొందుతున్న నారా లోకేశ్ ఎన్నికల్లో పోటీకి దిగే విషయంలోనూ సందిగ్ధత పూర్తిగా వీడలేదు. ఎమ్మెల్సీగా మంత్రి పదవిని అనుభవిస్తున్న ఆయన, ఈ ఎన్నికల్లో పెదకూరపాడు, భీమిలి, విశాఖ నార్త్ తదితర అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏదో ఒకచోట పోటీ చేస్తారని తెలుస్తోంది.

ఏది ఏమైనా లోకేశ్ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై చంద్రబాబుదే తుది నిర్ణయమని, ఇక భరత్ విషయంలో బాలయ్య మనసులో ఏముంటే అదే జరుగుతుందని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

More Telugu News