Prime Minister: ఇలాంటి ప్రధాని కూడా ఉంటారంటే ఆశ్చర్యమే!

  • పదవికి రాజీనామా చేసిన ఫిన్లాండ్ ప్రధాని
  • ఆరోగ్య పథకం అమలులో వైఫల్యమే కారణం
  • మరో 5 వారాల్లో ఎన్నికల ముంగిట సంచలన నిర్ణయం

ఏ దేశ భవిష్యత్తు అయినా సంస్కరణల అమలుపైనే ఆధారపడి ఉంటుంది. ఒక దేశం అభివృద్ధి పథంలో పయనించాలంటే మార్పు తప్పనిసరి. ఒకప్పుడు వెనుకబాటు తనంతో బాధపడిన అనేక దేశాలు నేడు సంస్కరణల ప్రాధాన్యతను గుర్తించి పురోగామి పథంలో పయనిస్తున్నాయి. అయితే మిగతా దేశాలకు చాలా విషయాల్లో ఆదర్శంగా నిలిచే ఫిన్లాండ్ లో ఇప్పుడో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ ప్రధాని జుహా సిపిలా అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. ప్రధాని తప్పుకోవడంతో ప్రభుత్వం కూడా రద్దయిపోయింది.

ఫిన్లాండ్ ప్రధానిగా సిపిలా కొంతకాలంగా సామాజిక ఆరోగ్య పథకాన్ని తీసుకురావడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఆయన సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తుండడంతో ప్రభుత్వంలో ఉన్న ఇతర పార్టీల సభ్యుల నుంచి ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోయారు. గత దశాబ్దకాలంగా ఈ పథకం ప్రకటనలకే పరిమితమైంది. దాంతో ఎలాగైనా అమలులోకి తీసుకురావాలన్న సిపిలా ఆకాంక్షలకు మిత్రపక్షాలు అడ్డంకిగా మారాయి.

దాంతో ఇప్పటికే అనేకసార్లు తాను రాజీనామా చేస్తానని బెదిరించినా ఫలితం లేకపోవడంతో ఎన్నికలు మరో 5 వారాల్లో ఉన్నాయనగా నిజంగానే రాజీనామా చేశారు సిపిలా. ప్రధాని కాకముందు ఐటీ నిపుణుడిగా, వ్యాపారవేత్తగా కోట్లు సంపాదించిన సిపిలా... ప్రధానిగా ఉండి కూడా సంస్కరణలు అమలు చేయలేకపోవడాన్ని వ్యక్తిగత వైఫల్యంగా భావించి పదవికి రాజీనామా చేశారు.

More Telugu News