Jammu And Kashmir: యూట్యూబ్ లో చూసి గ్రనేడ్ తయారీ.. జమ్మూ బాంబు దాడి కోసం స్కూలు పిల్లాడిని ఎంచుకున్న ఉగ్రవాదులు!

  • భారీ భద్రతను తప్పించుకుని దాడి చేసిన మైనర్ బాలుడు
  • హిజ్బుల్ కమాండర్ తో టచ్ లో ఉన్నట్లు నిర్ధారించిన పోలీసులు
  • టిఫిన్ బాక్స్ లో బాంబును తీసుకొచ్చి దాడిచేసిన నిందితుడు

జమ్మూకశ్మీర్ లో నిన్న ఆర్టీసీ బస్సు వద్ద గ్రనేడ్ దాడి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించి విస్తుగొలిపే విషయం వెలుగులోకి వచ్చింది.  దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్‌కు చెందిన 9వ తరగతి చదువుతున్న బాలుడు ఈ దాడి చేశాడని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన అధికారులు నిందితుడిని ఓ చెక్ పాయింట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఇంత భారీ సెక్యూరిటీని తప్పించుకుని అతను ఎలా దాడికి పాల్పడ్డాడు అనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు.

యూట్యూబ్ లో వీడియోలను చూసి నిందితుడు గ్రనేడ్ తయారుచేశాడని పోలీసులు తెలిపారు. దాన్ని టిఫిన్ బాక్సులో పెట్టుకుని వచ్చి బస్టాండ్ వద్ద దాడికి పాల్పడ్డాడని అన్నారు. ఈ ఘటనపై జమ్మూ ఐజీ ఎంకే సిన్హా మాట్లాడుతూ.. నిందితుడు కుల్గాం జిల్లా హిజ్బుల్ చీఫ్ ఫరూక్ అహ్మద్ భట్ తో టచ్ లో ఉన్నాడని వెల్లడించారు. జమ్మూలో మతసామరస్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడి జరిగిందని పేర్కొన్నారు. సదరు బాలుడు ఓ కారులో 250 కిలోమీటర్లు ప్రయాణించి జమ్మూకు వచ్చాడనీ, అతడిని తీసుకొచ్చిన డ్రైవర్ కోసం గాలింపు జరుపుతున్నామన్నారు.

More Telugu News