Andhra Pradesh: మహిళలు రాజకీయాల్లోకి రావాలి.. త్వరలోనే ఆర్టీసీలో డ్రైవర్లుగా నియమిస్తాం!: ఏపీ సీఎం చంద్రబాబు

  • కుటుంబ వ్యవస్థ దేశానికి గొప్పవరం
  • మహిళలు అసాధరణ శక్తులుగా మారారు
  • రాష్ట్రాభివృద్ధికి డ్వాక్రా సంఘాలు ఎంతో సహకరించాయి

కుటుంబ వ్యవస్థ భారతదేశానికి గొప్పవరమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కోటి మంది సభ్యులుండే ఏకైక వ్యవస్థ డ్వాక్రా సంఘాలనీ, డ్వాక్రా సంఘాల ద్వారా రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెడతామని అన్నారు. పోలీస్ శాఖలోను, ఆర్టీసీలోను మహిళలకు రిజర్వేషన్ కల్పించామని గుర్తుచేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లాలో ఏపీ ప్రభుత్వం ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు.

నేడు సామాన్య మహిళలు అసాధారణ శక్తులుగా మారారని ఏపీ సీఎం కొనియాడారు. డ్వాక్రా సంఘాల్లోని 98 లక్షల మంది మహిళలకు ఈరోజు రూ.3,500 చొప్పున అందించామని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి డ్వాక్రా సంఘాలు ఎంతో సహకరించాయని చెప్పారు. ఎన్టీఆర్‌ మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారని, మహిళలకు తల్లిదండ్రుల ఆస్తిలో సమానహక్కు కల్పిస్తూ చట్టం తీసుకొచ్చారని అన్నారు.

రాజకీయాల్లోకి మహిళలు రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. మహిళలకు తొలి విశ్వవిద్యాలయాన్ని ఎన్టీఆర్ తిరుపతిలో ఏర్పాటు చేశారన్నారు. కాగా, త్వరలోనే మహిళలను ఆర్టీసీలో డ్రైవర్లుగా నియమిస్తామని ఏపీ సీఎం ప్రకటించారు.

More Telugu News