MAA: నా గురించి శ్రీకాంత్ మాటలు పడుతున్నాడు.. ఇదే చివరి పోటీ!: శివాజీ రాజా

  • నేను పోటీ చేయకుంటే ఓ ఆర్టిస్టు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది
  • దేవుడు దిగొచ్చినా వచ్చేసారి పోటీ చేయను
  • నరేశ్ తీరుతో ఇండస్ట్రీని వదిలి అరుణాచలం వెళ్లిపోదామనుకున్నా

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఆదివారం జరగనున్న ఎన్నికల్లో శివాజీరాజా ప్యానెల్-నరేశ్ ప్యానెల్ మధ్య పోటీ హోరాహోరీ తప్పేలా కనిపించడం లేదు. ఇరు వర్గాలు పరస్పర ఆరోపణలకు దిగుతున్నాయి. కాగా, నరేశ్ ప్యానెల్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని శివాజా రాజా మండిపడ్డాడు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివాజీ రాజా మాట్లాడుతూ.. నిజానికి ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయకూడదనే అనుకున్నానని, కానీ ప్యానెల్ సభ్యుల బలవంతం మీదే బరిలోకి దిగినట్టు చెప్పాడు. వచ్చే ఎన్నికల్లో మాత్రం ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా పోటీ చేయబోనని తేల్చి చెప్పాడు. పద్మ అనే మహిళ తాను పోటీ చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని, ‘మా’ ఇచ్చే పింఛన్ తీసుకోనని చెప్పడం వల్లే పోటీ పడాల్సి వస్తోందన్నాడు.                      

ఎన్నికల సమయంలో టీవీల్లో ఎవరూ మాట్లాడకూడదన్న నిబంధన ఉందని, కానీ సోదరుడు నరేశ్, బావ రాజశేఖర్, అక్క జీవిత టీవీల్లో మాట్లాడుతూ తమపై బురద జల్లుతున్నారని శివాజీ రాజా ఆవేదన వ్యక్తం చేశాడు. తన గురించి శ్రీకాంత్ మాటలు పడుతున్నాడని, తనకు మద్దతు ఇచ్చేందుకు ఎస్వీ కృష్ణారెడ్డి లాంటి ప్రముఖ దర్శకుడు వచ్చాడని పేర్కొన్నాడు. ఇటీవల నరేశ్ తనను చాలా బాధపెట్టాడని, అప్పుడే ఇండస్ట్రీని వదిలి అరుణాచలం వెళ్లి స్థిరపడాలని అనిపించిందన్నాడు.

ఎస్వీ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. తన వంతుగా శివాజీకి సాయం చేయాలనే ఉపాధ్యక్షుడిగా పోటీ చేస్తున్నట్టు చెప్పాడు. రూ. 2.90 కోట్లు ఉన్న ‘మా’ సంక్షేమ నిధిని శివాజీ రాజా రూ.5.70 కోట్లకు పెంచాడని కొనియాడారు. తన నామినేషన్‌ను సరైన కారణం లేకుండానే తిరస్కరించారని, బహుశా తను ట్రెజరర్ గా ఉండడం నరేశ్‌కి ఇష్టం లేదేమోనని పరుచూరి వెంకటేశ్వరరావు అనుమానం వ్యక్తం చేశారు. ‘మా’కి సొంత భవనం కావాలంటే శివాజీ రాజా ప్యానెల్‌ను గెలిపించాలని శ్రీకాంత్ కోరాడు.

More Telugu News