Andhra Pradesh: డేటా చోరీ కేసును వీలైనంత త్వరగా విచారిస్తాం: సిట్ ఇన్ ఛార్జి స్టీఫెన్ రవీంద్ర

  • ఈ వివాదంపై విచారణకు ప్రత్యేక నిపుణులు అవసరం
  • ప్రతి అంశాన్ని కూలంకషంగా దర్యాప్తు చేస్తాం
  • ఐటీ గ్రిడ్, బ్లూ ఫ్రాగ్ సహా మరేమైనా సంస్థలున్నాయేమో పరిశీలిస్తాం

డేటా చోరీ వివాదంపై విచారణ నిమిత్తం ప్రత్యేక నిపుణుల సహకారం అవసరమని సిట్ ఇన్ ఛార్జి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డేటా వ్యవహారంపై హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలో దర్యాప్తు జరిగిందని చెప్పారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తును పరిశీలించామని, ఇంకా ఏం చేయాలన్న దానిపై ఓ నిర్ధారణకు వచ్చినట్టు తెలిపారు. ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ ఫిర్యాదుపై ప్రతి అంశాన్ని కూలంకషంగా, శాస్త్రీయ పద్ధతిలో సాంకేతిక పరిజ్ఞానం వాడి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని తెలిపారు.

డేటా చోరీ వ్యవహారంలో ఐటీ గ్రిడ్, బ్లూ ఫ్రాగ్ సహా మరేమైనా సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయా? అన్న విషయమై పరిశీలిస్తామని చెప్పారు. ఈ కేసులో ఎవరెవరి పాత్ర ఉందన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నామని, సిట్ లోని 9 మంది అధికారులు ఇప్పటికే విచారణ ప్రారంభించారని అన్నారు. డేటా చోరీ కేసు దర్యాప్తుపై మీడియా సంయమనం పాటించాలని ఈ సందర్భంగా సూచించారు.

‘సేవా మిత్ర’ యాప్ లో ఓటర్ల వ్యక్తిగత సమాచారం ఉందని, వ్యక్తిగత డేటా ప్రైవేట్ సంస్థకు ఎలా వచ్చిందన్న విషయమై దర్యాప్తు సాగుతుందని, ఈ కేసు దర్యాప్తులో పురోగతి ఉందని తెలిపారు. ఈ కేసు సాఫ్ట్ వేర్ కు సంబంధించిన వ్యవహారం కనుక కొంత సమయం పడుతుందని, ఏదేమైనా, వీలైనంత త్వరగా ఈ కేసు విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పిస్తామని స్టీఫెస్ రవీంద్ర అన్నారు.

More Telugu News