Andhra Pradesh: డేటా చోరీ కేసులో ఏపీ ప్రభుత్వం తప్పు లేదని ఎలా చెబుతారు?: వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ

  • ‘బ్లూ ఫ్రాగ్’ నుంచి ‘ఐటీ గ్రిడ్’ కు సమాచారం చేరింది
  • ప్రాథమిక విచారణ లేకుండా తప్పు లేదంటారా?
  • ప్రజల ఓట్లు కొనుగోలుకు చంద్రబాబు యత్నం

‘బ్లూ ఫ్రాగ్’ నుంచి ‘ఐటీ గ్రిడ్’ కు సమాచారం చేరిందని వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రాథమిక విచారణ లేకుండా ఏపీ ప్రభుత్వం తప్పు లేదని ఎలా చెబుతారని, మూడున్నర కోట్ల ప్రజల సమాచారం ప్రైవేట్ కంపెనీకి ఎలా వెళ్లిందని ప్రశ్నించారు. డేటా చోరీ కేసు వ్యవహారంలో వైసీపీపై తప్పుడు ప్రచారం చేయడం తగదని అన్నారు. ఫారం-7 ప్రజలకు ఇచ్చిన హక్కు, దీని కింద అప్లై చేసిన వారిని కోర్టుకు ఎలా లాగుతారని ప్రశ్నించారు. ఏపీ ప్రజల ఓట్లు కొనుగోలు చేసేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని, ఇందుకు ఐటీ గ్రిడ్స్ సంస్థ డేటా చోరీయే నిదర్శనమని ఆరోపించారు. చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలను, కుంభకోణాలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును కచ్చితంగా ప్రజలు ఓడిస్తారని జోస్యం చెప్పారు.

More Telugu News