Prakasam District: ఆటోమొబైల్ కేంద్రంగా దొనకొండ.. రూ.1800 కోట్లతో స్పెయిన్ సంస్థ ప్రాజెక్టు

  • ఆటోమొబైల్ టెస్టింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు స్పెయిన్ సంస్థ రెడీ
  • 800 ఎకరాల్లో రూ. 1800 కోట్లతో నిర్మాణం
  • వేలాదిమందికి ఉద్యోగావకాశాలు

నవ్యాంధ్రకు మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు రానుంది. స్పెయిన్‌కు చెందిన అప్లస్ ఐడియాడ సంస్థ రూ.1800 కోట్ల పెట్టుబడితో ప్రకాశం జిల్లాలోని దొనకొండలో ఆటోమొబైల్ టెస్టింగ్ కేంద్రాన్ని ప్రారంభించేందుకు ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. వాహనాల విడిభాగాలు, వాహనాల సామర్థ్యాన్ని ఈ కేంద్రంలో పరీక్షిస్తారు. స్పెయిన్‌లో ఈ సంస్థ ఇచ్చే సర్టిఫికెట్ ఆధారంగానే వాహనాలను కొనుగోలు చేస్తారు.  మొత్తం 800 ఎకరాల్లో రూ.1800 కోట్లతో టెస్టింగ్ సెంటర్‌ను ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతోంది. ఇటీవల జరిగిన పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో ఈ ప్రాజెక్టుపై ఒప్పందం కుదిరినట్టు ఈడీబీ అధికారులు తెలిపారు.

చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో ఇప్పటికే ఆటోమొబైల్ పరిశ్రమ విస్తరించింది. ఇసుజు, సుందరం క్లేటన్, టీహెచ్‌కే, హీరో కంపెనీలు తమ ప్లాంట్లను ఏర్పాటు చేశాయి. కృష్ణా జిల్లాలో అశోక్ లేలాండ్ ప్లాంటు రూపుదిద్దుకుంటోంది. అనంతపురంలో కియా ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించింది. ఇప్పుడు ప్రకాశం జిల్లాకు స్పెయిన్ కంపెనీ తరలిరానుండడం ఆహ్వానించదగ్గ పరిణామమని, దీనివల్ల వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

More Telugu News