Sri Bharth: విశాఖ నుంచి బరిలోకి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్?

  • మాజీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి మనవడే శ్రీభరత్
  • పార్టీకి విశేష సేవలు అందించిన మూర్తి
  • విశాఖ లోక్‌సభ స్థానాన్ని శ్రీభరత్‌కే ఇవ్వాలంటూ పార్టీ నేతల ఒత్తిడి

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో టీడీపీలో టికెట్ల వేడి టెన్షన్ పుట్టిస్తోంది. రోజురోజుకు ఆశావహుల సంఖ్య పెరుగుతుండడంతో టికెట్లు ఎవరికి దక్కుతాయోనన్న ఆత్రుత నేతల్లో మొదలైంది. ఉత్తరాంధ్రపై గట్టి పట్టున్న టీడీపీ అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఎక్కువమందికి తిరిగి టికెట్లు లభించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.
 
ఈ నేపథ్యంలో నేడు రెండు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో 14 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అయితే, లోక్‌సభకు కూడా అభ్యర్థులను ప్రకటిస్తారా? లేదా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇక, అత్యంత కీలకమైన విశాఖ లోక్‌సభ స్థానం నుంచి దివంగత ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి మనవడు, బాలకృష్ణ చిన్నల్లుడు, మంత్రి నారా లోకేశ్‌కు తోడల్లుడు అయిన శ్రీభరత్ పోటీ చేసే అవకాశం ఉందన్న వార్త ఇప్పుడు సంచలనమైంది.

ఎంవీవీఎస్ మూర్తి పార్టీకి ఎంతో సేవ చేశారని, దానిని దృష్టిలో పెట్టుకుని శ్రీభరత్‌కు అవకాశం ఇవ్వాలని పార్టీ నాయకుల్లో కొందరు అధిష్ఠానాన్ని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నగరంలోనే ఉన్న శ్రీభరత్ ఇప్పటికే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటున్నారు.  ఈ నేపథ్యంలో ఆయననే బరిలోకి దించాలని, ఆయన బరిలో ఉంటే గెలుపు నల్లేరుమీద నడకేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.  

More Telugu News