India: రెండు విమానాలు కూల్చామంటున్న పాక్... మరి మరో భారత పైలట్ ఎక్కడ?

  • భారత విమానాలపై దాడి చేసిన పాక్ పైలట్ల గుర్తింపు
  • పార్లమెంటులో ప్రకటన చేసిన పాక్ మంత్రి
  • నమ్మశక్యం కాని రీతిలో దాయాది మాటలు

పాకిస్థాన్ మరోసారి తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో పార్లమెంటు సాక్షిగా కొత్త నాటకానికి తెరలేపింది. మొన్నటికి మొన్న భారత వాయుసేనకు చెందిన ఇద్దరు పైలట్లను అదుపులోకి తీసుకున్నామని ప్రకటించి సాయంత్రానికి మాట మార్చేసింది. తూచ్.. ఒక్కరే మా అదుపులో ఉన్నారంటూ మరో ప్రకటన చేసింది. ఇప్పుడు దానికి పరాకాష్టగా పాక్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి పార్లమెంటులో ప్రగల్భాలు పలికారు. భారత వాయుసేనకు చెందిన రెండో విమానాన్ని కూల్చిన పాక్ పైలట్ ను కూడా గుర్తించామని, అతడి పేరు నౌమాన్ అలీ ఖాన్ అని, పాక్ ఎయిర్ ఫోర్స్ లో వింగ్ కమాండర్ అంటూ గొప్పగా చెప్పారు.

"పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ గగనతల ఉల్లంఘనలకు పాల్పడిన రెండు ఐఏఎఫ్ విమానాలను కూల్చివేసింది. ఒక విమానాన్ని స్క్వాడ్రన్ లీడర్ హసన్ సిద్ధిఖీ కూల్చివేయగా, రెండో విమానాన్ని వింగ్ కమాండర్ నౌమాన్ అలీ ఖాన్ నేలకూల్చాడు" అంటూ నమ్మశక్యం కాని రీతిలో ప్రకటన చేశారు.

అంతకుముందు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ ఓ సభలో మాట్లాడుతూ, భారత విమానాన్ని కూల్చింది స్క్వాడ్రన్ లీడర్ సిద్ధిఖీ అంటూ వేనోళ్ల కొనియాడారు. ఈ నేపథ్యంలో, ఖురేషీ స్పందిస్తూ... బిలావల్ కేవలం స్క్వాడ్రన్ లీడర్ సిద్ధిఖీ మాత్రమే జాతీయ హీరో అని చెబుతున్నారు, కానీ నౌమాన్ అలీ ఖాన్ కూడా మరో విమానాన్ని నేలకూల్చారని, ఆయనను కూడా గుర్తించాలని అన్నారు.

పాకిస్థాన్ మంత్రి ఖురేషీ చెబుతున్న దాన్ని బట్టి చూస్తే... కూలిపోయిన రెండు విమానాల్లో ఒకదాని పైలట్ అభినందన్ కాగా, రెండో విమానం పైలట్ ఎవరన్నది ఆయనకే తెలియాలి! కూలిపోయింది రెండు విమానాలన్నది నిజం కాగా, అందులో ఒకటి భారత్ కు చెందినది, మరొకటి పాక్ కు చెందినది. పాక్ విమాన పైలట్ ను కూడా భారత్ కు చెందినవాడనుకుని పాక్ ప్రజలు చితకబాదడంతో అతడు ఆసుపత్రిలో ప్రాణాలు విడిచాడు. ఇప్పుడు ఖురేషీ పొంతన లేని విషయాలు చెబుతూ గందరగోళం సృష్టిస్తున్నట్టు అర్థమవుతోంది.

More Telugu News