Andhra Pradesh: సీపీ సజ్జనార్ కనుసన్నల్లోనే అధికార దుర్వినియోగం జరిగింది: పయ్యావుల కేశవ్ ఆరోపణ

  • టీఎస్ పోలీసులు మఫ్టీలో విచారణ కూడా దొంగతనమే
  • ఉద్యోగులను బెదిరించి, సమాచారం సేకరించారు
  • సరైన సమయంలో ఆ వ్యక్తుల పేర్లు బయటపెడతా

డేటా చోరీ కోసం గత నెల 23కు ముందు వైసీపీ, ఐటీ అధికారులు కలిసి ప్లాన్ వేశారని, ఆ ప్లాన్ ని తెలంగాణ పోలీసులు అమలు చేశారని ఏపీ ప్రభుత్వ విప్, టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సరైన సమయంలో ఆ వ్యక్తుల పేర్లు బయటపెడతానని అన్నారు.

ఆ రోజున ‘ఐటీ గ్రిడ్’ సంస్థపై దాడులు చేసి అశోక్ ను, సిబ్బందిని విచారించిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. టీఎస్ పోలీసులు మఫ్టీలో చేసిన విచారణ దొంగతనం కిందే లెక్క అని, ఎఫ్ఐఆర్ లేకుండా ఉద్యోగులను బెదిరించి, సమాచారం సేకరించింది నిజం కాదా? అని ప్రశ్నించారు.

టీడీపీ డేటా దొంగతనం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కు తెలిసి జరిగిందా? తెలియకుండా జరిగిందా? అని అనుమానం వ్యక్తం చేశారు. సజ్జనార్ కనుసన్నల్లోనే అధికార దుర్వినియోగం జరిగిందని, మార్చి 2వ తేదీ అర్ధరాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, ఆ మర్నాడే అశోక్ పరారయ్యారని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు.

ఈ నెల నాల్గో తేదీన నిర్వహించిన విలేకరుల సమావేశంలో సజ్జనార్ పత్తిత్తులా మాట్లాడారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత నెల 23న ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో సోదాలు చేశామని చెప్పగలిగే దమ్ము సజ్జనార్ కు ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అడుగులకు మడుగులొత్తకుండా ఓ ఐపీఎస్ అధికారిలా సజ్జనార్ వ్యవహరించాలని హితవు పలికారు.

ఈ వ్యవహారంపై ఈరోజు గుంటూరులో కేసు నమోదు చేస్తున్నామని, రేపటి నుంచి సైబరాబాద్ కమిషనర్ పరారీలో ఉన్నారని ప్రకటించమంటారా? అంటూ సజ్జనార్ పై పయ్యావుల సెటైర్లు విసిరారు.

More Telugu News