Australia: ఆస్ట్రేలియన్లకు దొరికిన ఏలియన్ చేప?

  • ఇప్పటివరకు ఎక్కడా చూడని వింతజీవి
  • పాము తల.. పదునైన పళ్లు
  • కనిపించని కళ్లు

ఆస్ట్రేలియా మత్స్యకారుల వలలో తాజాగా ఓ విచిత్రమైన చేప లభ్యమైంది. దానికి కళ్లు లేకపోగా, పదునైన పళ్లతో పామును పోలి ఉంది. కళ్లు ఉండాల్సిన స్థానంలో దృఢమైన ఫలకాలు దర్శనమిస్తున్నాయి. నిత్యం చేపలతో సహవాసం చేసే మత్స్యకారులు సైతం అదే చేపో, లేక మరేదైనా జీవో చెప్పలేకపోతున్నారు. కకావు నేషనల్ పార్క్ సమీపంలో ఆండ్రూ రోజ్ అనే వ్యక్తి చేపలు పడుతుండగా ఈ 15 సెంటీమీటర్ల చేప దొరికింది. సరిగా ఈదలేని పరిస్థితుల్లో ఆ వింత చేప లభ్యమైందని రోజ్ తెలిపాడు. దాన్ని ఫొటోలు తీసిన అనంతరం తిరిగి నీళ్లలో వదిలేసినట్టు వెల్లడించాడు. దీన్ని ఏలియన్ చేపగా అభివర్ణించాడు రోజ్ స్నేహితుడు టీ హోకిన్. ఈ చేప పర్పుల్ బ్రౌన్ కలర్ లో ఉందని, పదునైన పళ్లతో భీతిగొలిపేలా ఉందని వివరించాడు.

ఈ చేపలాంటి జీవి ఫొటోలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి, "ఇలాంటి జీవిని ఎవరైనా ఇంతకుముందు చూశారా" అంటూ క్యాప్షన్ పెట్టారు. దాంతో నెటిజన్లు రెచ్చిపోయి మరీ కామెంట్లు చేశారు. ఇది ఏలియన్ చేప అయ్యుంటుందని ఒక నెటిజన్ వ్యాఖ్యానిస్తే, ప్రిడేటర్ల ప్రేమ ఫలితంగా జన్మించి ఉంటుందని మరో నెటిజన్ సెటైర్ వేశాడు. ఇక నార్తర్న్ టెరిటరీలోని మ్యూజియం అండ్ ఆర్ట్ గ్యాలరీలోని చేపల సంరక్షకుడు డాక్టర్ మైకేల్ హ్యామర్ మాట్లాడుతూ, ఇది పూర్తిగా కొత్త జాతికి చెందిన జీవిగా భావిస్తున్నట్టు తెలిపారు.

More Telugu News