Andhra Pradesh: దొంగతనం ఎక్కడ జరిగితే అక్కడే కేసు పెట్టాలి: వైఎస్ జగన్

  • డేటా చోరీ జరిగిన ఆఫీసులన్నీ హైదరాబాద్ లోనే ఉన్నాయి
  • అక్కడ కాకుండా వేరే చోట కేసులు ఎందుకు పెడతారు?
  • బాబు చేసింది తప్పు.. దీన్ని రాష్ట్రాల మధ్య గొడవగా చిత్రీకరిస్తారా?

దొంగతనం ఎక్కడ జరిగితే అక్కడే కేసు పెడతారు తప్ప, వేరే చోటుకు వెళ్లరని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ని కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం, మీడియాతో జగన్ మాట్లాడారు. డేటా చోరీ జరిగిన ఆఫీసులన్నీ హైదరాబాద్ లోనే ఉన్నాయని, యథేచ్ఛగా చేయకూడని పనులన్నీ ఆ ఆఫీసుల్లో చేస్తుంటే, హైదరాబాద్ లో కాకుండా మరెక్కడైనా కేసులు ఎందుకు పెడతారని ఓ ప్రశ్నకు సమాధానంగా జగన్ జవాబిచ్చారు.

'ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఆరోపణలు చేస్తున్నామని కాదు. చేయకూడని పనిని చంద్రబాబు ఎలా చేశారని మీడియా కూడా ప్రశ్నించాలి' అని అన్నారు. చంద్రబాబు చేసింది తప్పు అని, పైపెచ్చు ఈ వ్యవహారాన్ని రెండు రాష్ట్రాల మధ్య గొడవగా ఆయన చిత్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు. చేయకూడని పని చేసిన చంద్రబాబు, ఆ పనిని ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల మధ్య గొడవగా చిత్రీకరిస్తున్నారని, ఇదెక్కడి న్యాయం? అని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా ఫారం-7 అంశం గురించి జగన్ ప్రస్తావించారు. డేటా చోరీ కేసును పక్కదోవ పట్టించేందుకే ఫారం-7 అంశాన్ని చంద్రబాబు తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. దొంగఓట్లు ఉన్న చోట ఫారం-7 సమర్పించి వాటిని తొలగించాలని కోరామని ఇదేమీ తప్పుకాదని అన్నారు. ఫారం-7 సమర్పించడం నేరం కాదని, ఆధార్ సమాచారాన్ని దొంగిలించడం నేరమంటూ చంద్రబాబుపై దుమ్మెత్తి పోశారు. ఓ ముఖ్యమంత్రి ఈ విధంగా ప్రవర్తిస్తుంటే ప్రజలకు భద్రత ఉండదని, ప్రజల వ్యక్తిగత సమాచారం అంతా ఓ ప్రైవేట్ కంపెనీకి ముఖ్యమంత్రి ఇవ్వడం పెద్ద నేరమని అన్నారు.

More Telugu News