jagan: ఏపీలో 54 లక్షల ఓట్లను తొలగించేందుకు కుట్ర జరుగుతోంది: కనకమేడల

  • ఈసీని కలసి వచ్చిన తర్వాత జగన్ కుట్రకు తెరతీశారు
  • జగన్ కు టీఆర్ఎస్ సహకరిస్తోంది
  • చట్ట రీత్యా జగన్ శిక్షార్హులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల తొలగింపు వల్లే టీఆర్ఎస్ గెలిచిందని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనమేడల రవీంద్ర కుమార్ అన్నారు. దాదాపు 24 లక్షల ఓట్లు గల్లంతయ్యాయనే ఆందోళనలు వ్యక్తమయినప్పుడు అలాంటిదేం లేదని తెలంగాణ ఎన్నికల అధికారి రజత్ కుమార్ అప్పట్లో చెప్పారని... ఎన్నికలు పూర్తయిన తర్వాత ఓట్లు గల్లంతైన మాట వాస్తవమేనంటూ, సింపుల్ గా సారీ చెప్పి తప్పించుకున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ఏపీలో కూడా అదే జరుగుతోందని అన్నారు.

ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ అధినేత జగన్ కలిసి వచ్చిన తర్వాత... ఓట్లు తొలగింపు ప్రక్రియను ప్రారంభించారని కనకమేడల విమర్శించారు.  ఏపీలో 54 లక్షల ఓట్లను తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో జగన్ కు టీఆర్ఎస్ సహకరిస్తోందని... వీరిద్దరికి మధ్య మోదీ అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అందరూ కలసి ఏపీలో ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నారని విమర్శించారు. దొంగ ఓట్లు మాత్రమే తొలగిస్తే తప్పు లేదని అన్నారు.

ఎన్నికల సంఘాన్ని జగన్ తప్పుదోవ పట్టించారని... చట్ట రీత్యా ఆయన శిక్షార్హుడని కనకమేడల అన్నారు. ఎన్ని నియోజకవర్గాల్లో ఓట్లను తొలగించారో ఈసీ వెంటనే ప్రకటించాని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో ఓడిపోతున్నామన్న భయంతోనే ఇలాంటి నీచమైన చర్యలకు వైసీపీ పాల్పడుతోందని చెప్పారు.

హైదరాబాదులోని ఐటీ కంపెనీలో ఉన్న ఏపీ డేటాను తీసుకుని జగన్ కు ఇచ్చేందుకు తెలంగాణ పోలీసుల ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేసిందని కనకమేడల మండిపడ్డారు. దొంగతనం చేశారని, అది బయటపడటంతో... పక్కవారిని దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీ డేటా, టీడీపీ డేటాను దొంగిలించిన టీఆర్ఎస్ పార్టీ సైబర్ క్రైమ్ కింద నేరం చేసినట్టేనని అన్నారు. ఇప్పటికే ఏపీలో ఈసీ వద్ద 200 కేసులు నమోదయ్యాయని... పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతోందని చెప్పారు.

More Telugu News