ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టేసిన తెలంగాణ యువతి!

06-03-2019 Wed 12:52
  • ఆత్మకూరు (ఎస్) మండలానికి చెందిన సువర్ణ
  • సైన్స్ టీచర్ గా, పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగాలు
  • తనిష్టమొచ్చిన ఉద్యోగం చేయవచ్చన్న తల్లిదండ్రులు

ఇండియాలో యువతకు ఉపాధి లభించడం లేదని, నిరుద్యోగుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుందని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని విమర్శలు వెల్లువెత్తున్న వేళ, నైపుణ్యముంటే ప్రభుత్వ ఉద్యోగం రావడం ఎంత సులువో నిరూపించిందో తెలంగాణ యువతి. ఆత్మకూరు (ఎస్) మండలానికి చెందిన నెమ్మికల్‌ గ్రామ యువతి, ఏకంగా రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి, తానెంత చదువుల సరస్వతినో నిరూపించింది.

 ఎంఎస్సీ బీఈడీ చేసిన జటంగి సువర్ణ అనే యువతి, గురుకుల సైన్స్‌ టీచర్ గా, పంచాయతీ కార్యదర్శిగా ఒకేసారి రెండు ఉద్యోగాలు సంపాదించింది. తాను రాసిన రెండు ప్రవేశ పరీక్షల్లో, ఇంటర్వ్యూల్లో విజయం సాధించింది. నెమ్మికల్‌ లో ఇంటర్ వరకూ, సూర్యాపేటలో డిగ్రీని, ఉస్మానియాలో ఎంఎస్‌సీ ఆపై బీఈడీని పూర్తి చేసిన ఆమె, తాను అటెంప్ట్ చేసిన రెండు ఉద్యోగాలకూ ఎంపికైంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు, నెమ్మికల్ గ్రామస్తులు తమ హర్షాన్ని వెలిబుచ్చారు. ఇక ఏ ఉద్యోగం చేయాలన్నది ఆమె అభీష్టానికే వదిలేసినట్టు తల్లిదండ్రులు వెల్లడించారు.