ayodya ramjanmabhoomi: అయోధ్య వ్యవహారంలో మధ్యవర్తి నియామకంపై తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు!

  • రామజన్మభూమి వివాదంపై ఈరోజు సుప్రీం కోర్టులో వాదనలు
  • మధ్యవర్తిత్వానికి అవకాశం ఉందా అని ప్రశ్నించిన కోర్టు
  • మధ్యవర్తిత్వానికి అంగీకరించమన్న హిందూ మహాసభ 

సుదీర్ఘకాలం నుంచి నలుగుతున్న అయోధ్యలోని రామజన్మ భూమి, బాబ్రీ మసీదు భూ వివాదం కేసులో మధ్యవర్తిత్వానికి ఎటువంటి అవకాశం లేదని హిందూ మహాసభ కోర్టుకు తెలిపింది. ఇది ప్రజల సెంటిమెంట్‌కు సంబంధించిన అంశమని, ఈ వ్యవహారంలో మధ్యవర్తిత్వం వహించేందుకు ఏ ఒక్కరూ ముందుకు రారని కోర్టుకు తెలిపింది.

ఈరోజు సర్వోన్నత న్యాయస్థానంలో అయోధ్య వివాదంపై వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఈ వివాదం విషయంలో మధ్యవర్తిత్వానికి ఒక శాతమైనా అవకాశాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఆ విధంగా ఉంటే తామే మధ్యవర్తిని నియమిస్తామని పిటిషనర్‌కు స్పష్టం చేశారు.

దీనిపై స్పందించిన పిటిషనర్‌ శిశిర్‌ చతుర్వేది మాట్లాడుతూ అయోధ్య అనేది హిందువుల ఆస్తి అని, అందువల్ల మధ్యవర్తిత్వం సాధ్యం కాదన్నారు. మధ్యవర్తిత్వానికి ప్రజలెవరూ ఒప్పుకొనే అవకాశమే లేదని, తాము కూడా అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇది కేవలం ఆస్తి తగాదా మాత్రమే కాదని, రెండు మతాలు, విశ్వాసాలకు సంబంధించిన విషయమని వ్యాఖ్యానించారు.

ఏం జరగబోతోందో మీరు ముందే ఎలా ఊహిస్తారని హిందూ మహాసభ తరఫు న్యాయవాదిని జస్టిస్‌ బాబ్డే ప్రశ్నించారు. మధ్యవర్తిత్వానికి ప్రయత్నించకుండానే వెనకడుగు వేయడం సరికాదని సూచించారు. జరిగిపోయిన దాన్ని మార్చలేమని, ఇప్పుడీ సమన్యను ఎలా పరిష్కరించాలో ఆలోచిస్తున్నామని తెలిపారు.

మధ్యవర్తిత్వం అంటే ఒక్కరు కాదని, ఓ బృందాన్నినియమిస్తామని చెప్పారు. కాగా, మధ్యవర్తిత్వానికి తాము సిద్ధంగానే ఉన్నామని ముస్లిం సంఘాల తరఫు న్యాయవాది రాజీవ్‌ ధావన్‌ తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

More Telugu News