vk singh: చంపిన దోమలను లెక్కించుకుంటూ ఉండాలా? లేక పడుకోవాలా?: కేంద్ర మంత్రి వీకే సింగ్

  • ప్రతిపక్ష నేతలను బాలాకోట్ కు పంపిస్తాం
  • అక్కడేం జరిగిందో చూసి రండి
  • విపక్షాల విమర్శలతో దేశానికి నష్టం జరుగుతుంది

పాకిస్థాన్ లోని బాలాకోట్ లో జైషే మొహమ్మద్ ఉగ్ర స్థావరాలపై జరిపిన దాడుల్లో ఎంత మంది టెర్రరిస్టులు హతమయ్యారో ఆధారాలతో పాటు లెక్కలు చెప్పాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విపక్షాలపై కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ ట్విట్టర్ ద్వారా మండిపడ్డారు.

'రాత్రి 3.30 గంటల సమయంలో దోమలు ఎక్కువగా ఉన్నాయి. వాటిని 'హిట్'తో చంపాను. ఆ తర్వాత హాయిగా పడుకోనా? లేక చచ్చిన దోమలను లెక్క పెట్టుకుంటూ ఉండాలా?' అని ప్రశ్నించారు. విపక్ష నేతలు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి రావాలని అన్నారు. వాయుసేన విమానాలలో ప్రతిపక్ష నేతలను కూడా బాలాకోట్ కు పంపిస్తామని... అక్కడ ఏం జరిగిందో చూసి రావాలని ఎద్దేవా చేశారు. రాజకీయ లబ్ధి కోసం విపక్ష నేతలు చేస్తున్న విమర్శలతో... దేశానికి తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. చిదంబరం, కపిల్ సిబల్ లాంటి నేతలకు వేరే పని ఏమీ ఉండదని... లేనిపోని విమర్శలతో వారి గౌరవాన్ని వారే తగ్గించుకుంటున్నారని చెప్పారు.

More Telugu News