Andhra Pradesh: మాది డెవలప్ మెంట్ టెక్నాలజీ.. మీదేమో ‘డిలీషన్’ టెక్నాలజీ!: కేసీఆర్ పై మంత్రి దేవినేని ఉమ సెటైర్

  • తెలంగాణ ఎన్నికలప్పుడు 28 లక్షల ఓట్లు తీసేశారు
  • ఇప్పుడు ఏపీలో 58 లక్షల ఓట్ల తొలగింపునకు కుట్ర పన్నారు
  • ఫాంహౌస్ లో వైసీపీ ఎంపీల జాబితా తయారవుతోంది

ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈరోజు బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాదాపు 28 లక్షల ఓట్లను టీఆర్ఎస్ తొలగించిందని ఆయన ఆరోపించారు. ఇప్పుడు ఏపీలో అదే కుట్రను జగన్ కోసం అమలు చేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారని విమర్శించారు. ఇందులో భాగంగా 58 లక్షల ఓట్లను తొలగించబోతున్నారని అన్నారు. విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

తాము ఆంధ్రప్రదేశ్ లో డెవలప్ మెంట్(అభివృద్ధి) టెక్నాలజీ వాడుతుంటే, కేసీఆర్ డిలీషన్ (ఓట్లను తొలగించే) టెక్నాలజీని వాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎర్రవల్లిలోని ఫాంహౌస్ లో కేసీఆర్, బీజేపీ నేత రాంమాధవ్ కూర్చుని వైసీపీ లోక్ సభ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వంతో కుమ్మక్కు అయిన జగన్ ఏపీ పోలీసులపై కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ పై ఏపీకి కూడా అధికారం ఉందని గుర్తుచేశారు.

కేసీఆర్ ముసుగు తొలగించి ముందుకురావాలని మంత్రి ఉమామహేశ్వరరావు ఈ సందర్భంగా సవాల్ విసిరారు. జగన్ గృహ ప్రవేశానికి వస్తానని కేసీఆర్ ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలికారని, అలాగే విశాఖపట్నానికి వస్తానని అన్నారనీ, అయినా ఎందుకు రాలేదని ప్రశ్నించారు. టీడీపీ జాతీయ పార్టీ కాబట్టి చంద్రబాబు తెలంగాణకు వచ్చి ప్రచారం చేశారన్నారు.

ఫామ్ 7 ద్వారా ఓట్లు తొలగించే ప్రక్రియకు వైసీపీ శ్రీకారం చుట్టిందని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో వైసీపీ నేతలపై 45 కేసులను ఎన్నికల సంఘం నమోదు చేసిందన్నారు. ఈ విషయమై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

More Telugu News