Andhra Pradesh: బీహార్ నుంచి జగన్ ‘పీకే’ను తీసుకొచ్చాడు.. పీకే అనే పేరును విన్నారా తమ్ముళ్లూ?: సీఎం చంద్రబాబు

  • ఏపీలో 8 లక్షల ఓట్లను తీసేశారు
  • రేపు నా ఓటును కూడా తీసేస్తారేమో
  • తోక కట్ చేస్తామని హెచ్చరించిన ఏపీ సీఎం

వైఎస్ జగన్ లాంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే రైతులకు నీళ్లు కూడా దక్కవని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం తవ్వించిన కాలువల్లో ఇప్పుడు కన్నీళ్లే పారుతాయని హెచ్చరించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సాయంతో దొడ్డిదారిన ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఈరోజు జరిగిన ‘జలసిరికి హారతి’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..‘ఇప్పుడు బీహార్ నుంచి ఒకాయనను జగన్ తీసుకొచ్చారు. ఆయన పేరు పీకే. పీకే పేరు విన్నారా తమ్ముళ్లూ.. ఇప్పటివరకూ మొత్తం 8 లక్షల ఓట్లను ఏపీలో తీసేశారు. అదేంటో నాకు అర్థం కావట్లేదు. నా ఓటును కూడా వీళ్లు తీసేస్తారేమో. ఏమనుకుంటున్నారు వీళ్లు? ఇదేమన్నా బీహార్ అనుకుంటున్నారా? ఇది ఆంధ్రప్రదేశ్. మీ ఆటలను కొనసాగనివ్వం. తోక కట్ చేస్తాం’ అని హెచ్చరించారు.

వైసీపీ నేతలు ఓటర్ జాబితాలో టీడీపీ కార్యకర్తల లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో పోలీసులకు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. ఏటీఎంల్లో డబ్బులు కొట్టేయడం, భూకబ్జాలు, దొంగ సారా వ్యాపారం వైసీపీ నేతలకు అలవాటేనని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ నేతలు చాలా దుర్మార్గులని ఆరోపించారు. తాను మర్యాదకు మర్యాద ఇస్తాననీ, ఇష్టప్రకారం ప్రవర్తిస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ-కేసీఆర్-జగన్ కలిసి పోటీచేసినా తనకు ఎలాంటి నష్టం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. తాను కులాలు, మతాలు చూసి పింఛ న్లు, రైతు రుణమాఫీ, పసుపు-కుంకుమ నగదు ఇవ్వలేదని సీఎం అన్నారు. ప్రజలకు న్యాయంగా లబ్ధి చేకూర్చానని అన్నారు. ఇప్పుడు ఈ దుర్మార్గులు కులాలు, మతాలు తీసుకొచ్చి విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.

More Telugu News