West Godavari District: శ్రీధరణి హత్యాచారం కేసును ఛేదించిన పోలీసులు.. నలుగురి అరెస్ట్.. పోలీసులు చెప్పిన విస్తుపోయే నిజాలు!

  • గత నెల 24న ఘటన
  • బౌద్ధారామాల సందర్శనకు వచ్చిన ప్రేమ జంటపై దాడి
  • నిందితుల్లో ఒక్కడే 16 అత్యాచారాలు

పశ్చిమ గోదావరి జిల్లాలో గత నెల జరిగిన శ్రీధరణి (19) హత్యచారం కేసును పోలీసులు ఛేదించారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ నిన్న వీరిని విలేకరుల ఎదుట ప్రవేశపెట్టారు.

గత నెల 24న జిల్లాలోని కామవరపుకోట మండలం జీలకర్రగూడెంలోని బౌద్ధారామాల సందర్శనకు  ప్రియుడు నవీన్‌తో కలిసి వచ్చిన శ్రీధరణిపై  కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన పొట్లూరి అంకమరావు అలియాస్‌ రాజు (28), జి.కొత్తపల్లికి చెందిన తుపాకుల సోమయ్య (22), తుపాకుల గంగయ్య (20), మాణికం నాగరాజు (20)లు అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డువచ్చిన నవీన్‌ను చితకబాదారు. అనంతరం శ్రీధరణిని కర్రతో కొట్టి హత్య చేశారు.

ఈ కేసును తీవ్రంగా పరిగణించిన పోలీసులు తాజాగా రాజు, సోమయ్య, గంగయ్య, నాగరాజులను అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా ఎస్పీ రవిప్రకాశ్ మాట్లాడుతూ.. నిందితులందరూ ఓ ముఠాగా ఏర్పడి ప్రేమ జంటలను, మహిళలను టార్గెట్ చేస్తారని తెలిపారు. నేరం చేయడానికి మూడు రోజుల ముందే రెక్కీ నిర్వహిస్తారని పేర్కొన్నారు.

నిందితుల్లో అంకమరావు ఒక్కడే 16 అత్యాచారాలకు పాల్పడినట్టు తెలిపారు.  వీరిపై ఇప్పటికే పలు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయని వివరించారు. ఆదివారం పూట ఒంటరిగా వచ్చే ప్రేమ జంటల్ని లక్ష్యంగా చేసుకుని నేరాలకు పాల్పడుతుంటారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ముగ్గురు యువకులు, ఓ యువతిని హత్య చేసినట్టు తమ దర్యాప్తులో తేలిందన్నారు. కృష్ణా జిల్లాలో ఓ హెచ్‌ఐవీ బాధిత మహిళను కూడా వీరు వదల్లేదని ఎస్పీ వివరించారు.

More Telugu News