jagan: కేసును ఏపీకి బదిలీ చేయకుండా తెలంగాణ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేసింది?: పయ్యావుల కేశవ్

  • టీడీపీ సర్వీస్ ప్రొవైడర్లపై టీఆర్ఎస్ ను అడ్డం పెట్టుకుని వైసీపీ దాడులు చేయిస్తోంది
  • కేసీఆర్ చేతిలో జగన్ పావులా మారారు
  • జగన్, విజయసాయిలకు ఏపీ ప్రజలు బుద్ధి చెబుతారు

వైసీపీపై ఏపీ శాసనమండలి చీఫ్ విప్ పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. టీడీపీ సేవామిత్ర యాప్ సర్వీస్ ప్రొవైడర్లపై టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. నిర్వాహకులను కిడ్నాప్ చేసి, సర్వర్లను స్వాధీనం చేసుకోవడానికి రాజకీయపరంగా కుట్రలకు పాల్పడుతున్నారని అన్నారు. టీడీపీ సభ్యత్వ నమోదు, బూత్ కన్వీనర్ల డేటాతో పాటు, టీడీపీ సభ్యుల వివరాలను దొంగిలిస్తున్నారని చెప్పారు. ఈ డేటాను వైసీపీకి అందించేందుకు ఐటీ కంపెనీలపై తెలంగాణ పోలీసులు దాడి చేశారని ఆరోపించారు. ఏపీ ఓటర్ల సమాచారం చేతులు మారిందనే కేసు ఏపీ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల పరిధిలోకి వస్తుందని... తెలంగాణ పరిధిలోకి రాదని అన్నారు.

చట్ట ప్రకారం ఈ కేసును ఏపీకి బదిలీ చేయాల్సి ఉందని... కానీ, తెలంగాణ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో అంతరార్థం ఏమిటని పయ్యావుల ప్రశ్నించారు. కేసీఆర్, జగన్ లు కలిసిపోయారని చెప్పడానికి ఇది ఒక రుజువు అని అన్నారు. కేసీఆర్ చేతిలో జగన్ పావులా మారిపోయాడని ఎద్దేవా చేశారు. జగన్, విజయసాయిరెడ్డి కుట్రలకు ఏపీలోని ఐదు కోట్ల మంది బుద్ధి చెబుతారని అన్నారు.

More Telugu News