Telangana: సీఎల్సీ సమావేశం నుంచి మధ్యలోనే వెళ్లిపోయిన కోమటిరెడ్డి

  • ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరుతున్న నేపథ్యంలో అత్యవసర సమావేశం
  • రాష్ట్రానికి బలమైన నాయకత్వాన్ని ఇవ్వాలన్న కోమటిరెడ్డి
  • నాయకత్వం బలంగా ఉంటే 8 లోక్ సభ స్థానాలను గెలుచుకుంటాం

తెలంగాణ కాంగ్రెస్ లో విభేదాలు అంతకంతకూ ముదురుతున్నాయి. ఈరోజు హైదరాబాదులో జరిగిన సీఎల్పీ సమావేశం నుంచి మధ్యలోనే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెళ్లిపోయారు. బయటకు వచ్చిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రానికి బలమైన నాయకత్వాన్ని ఇవ్వాలని కోరానని.. ఎన్నికల ముందు కూడా ఇదే చెప్పానని అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో చివరి వరకు అభ్యర్థులను కూడా ప్రకటించలేకపోయామని, తనలాంటి నేతలకు కూడా ఆఖరి వరకు టికెట్ ఇవ్వలేదని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నాయకత్వంతోనే పార్లమెంటు ఎన్నికలకు వెళుతుండటం సంతోషాన్ని ఇవ్వడం లేదని అన్నారు. నాయకత్వ మార్పు అత్యవసరమని అధిష్ఠానాన్ని కోరామని చెప్పారు. నాయకత్వం బలంగా ఉంటే పార్లమెంటు ఎన్నికల్లో 8 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటుందని తెలిపారు.

ఈరోజు తెలంగాణ సీఎల్పీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరుతున్న నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించింది. ఈ సమావేశానికి భట్టి విక్రమార్క, సబితా ఇంద్రారెడ్డి, జగ్గారెడ్డి, సీతక్క, గండ్ర వెంకటరమణారెడ్డి, శ్రీధర్ బాబు, సురేందర్ తదితరులు హాజరయ్యారు.

More Telugu News