kumaraswamy: నా తండ్రి హయాంలో పేలుళ్లు, చంపుకోవడాలు లేదు.. ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయి?: కుమారస్వామి

  • జమ్ముకశ్మీర్ కు భారీగా భద్రతాబలగాలను పంపాలని మోదీ అనుకుంటున్నారు
  • పాకిస్థాన్ పై బీజేపీ వాళ్లే దాడి చేసినట్టు చెప్పుకుంటున్నారు
  • జవాన్ల వెంట బీజేపీ మాత్రమే ఉన్నట్టు వ్యవహరిస్తున్నారు

తన తండ్రి దేవెగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో జరగని ఉగ్రదాడులు ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రశ్నించారు. దేవెగౌడ హయాంలో పేలుళ్లు, చంపుకోవడాలు లేవని అన్నారు. ఇప్పుడే ఇవన్నీ ఎందుకు చోటుచేసుకుంటున్నాయని ప్రశ్నించారు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సి ఉందని మైసూరులో జరిగిన ఒక బహిరంగసభలో సభికులను ఉద్దేశించి కుమారస్వామి అన్నారు.

జమ్ముకశ్మీర్ కు భారీ ఎత్తున భద్రతాదళాలను పంపాలని ప్రధాని మోదీ అనుకుంటున్నారని కుమారస్వామి చెప్పారు. కానీ, ఇండో-పాక్ సరిహద్దు వద్దకు ఓపెన్ టాప్ జీపులో వెళ్లిన ఏకైక ప్రధాని దేవెగౌడేనని అన్నారు. ఈ విషయాన్ని ఎవరూ మర్చిపోకూడదని చెప్పారు. ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఎక్కడి వరకు వెళతాయో తాను చెప్పలేనని అన్నారు.

పాక్ గడ్డపై జరిపిన వాయుసేన దాడుల నేపథ్యంలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరపుకుంటున్నాయని... రెండు మతాల మధ్య ఇది విద్వేషాలను మరింత పెంచుతుందని తెలిపారు. బీజేపీవాళ్లే పాక్ గడ్డపైకి ఎయిర్ క్రాఫ్ట్ పై వెళ్లి, దాడి చేసి వచ్చినట్టు చెప్పుకుంటున్నారని విమర్శించారు. దేశ ప్రయోజనాలకు ఇది మంచిది కాదని అన్నారు. జవాన్ల వెంట బీజేపీ మాత్రమే ఉన్నట్టు... మరెవరూ లేనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అమాయకులను మోసం చేసేందుకు బీజేపీ యత్నిస్తోందని అన్నారు.

మరోవైపు కుమారస్వామి వ్యాఖ్యలపై బీజేపీ కూడా అదే స్థాయిలో విమర్శలు గుప్పించింది. భారత్ లోని ఒక రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి అని... పాకిస్థాన్ లోని రాష్ట్రానికి కాదని విమర్శించింది. కుమారస్వామి వ్యాఖ్యలు భారత్ వ్యతిరేక గొంతుకను వినిపించే విధంగా ఉన్నాయని మండిపడింది.

More Telugu News