Andhra Pradesh: భీమిలి నుంచి లోకేశ్ పోటీపై వార్తలు చూశా.. కానీ ఈసారి నేనే పోటీ చేస్తా!:గంటా శ్రీనివాసరావు

  • టీడీపీ కార్యకర్తల ఓట్లను భారీగా తొలగిస్తున్నారు
  • 15 నియోజకవర్గాల్లో 74 వేల ఓట్ల తొలగింపుకు దరఖాస్తులు ఇచ్చారు
  • విశాఖ మీడియా సమావేశంలో మండిపడ్డ టీడీపీ నేత

తెలుగుదేశం కార్యకర్తలు, మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు ప్రతిపక్ష వైసీపీ భారీ కుట్రకు తెరలేపిందని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. కుతంత్రాలతో అప్రజాస్వామికంగా గెలిచేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుట్రలకు తెలంగాణ ప్రభుత్వం సహకరించడం దారుణమని వ్యాఖ్యానించారు. విశాఖలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో గంటా మాట్లాడారు.

అధికారంలోకి రాకముందే జగన్ అరాచకాలు, అకృత్యాలు బయటపడుతున్నాయని దుయ్యబట్టారు. ఏపీ మంత్రి లోకేశ్ భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తనకు పత్రికల ద్వారా తెలిసిందని గంటా శ్రీనివాసరావు చెప్పారు. తాను ఈసారి భీమిలి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇప్పటికే చెప్పానన్నారు.

ఒకవేళ ఈ ఎన్నికల్లో పోటీ చేయవద్దని చంద్రబాబు ఆదేశిస్తే శిరసావహిస్తాననీ, పార్టీకి సేవ చేసుకుంటానని పేర్కొన్నారు. భీమిలి నియోజకవర్గంలో ఓట్ల సంఖ్యను పరిశీలిస్తే నివ్వెరపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని గంటా అన్నారు. విశాఖపట్నం జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో 74,848 ఓట్లను ఫారం-7 ద్వారా తొలగించాలని వైసీపీ నేతలు దరఖాస్తులు సమర్పించారని ఆరోపించారు.

More Telugu News