జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి ఓటునే తొలగించేశారు.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి?: మిథున్ రెడ్డి

03-03-2019 Sun 13:33
  • ఏపీ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించింది
  • అక్రమంగా సమాచారాన్ని ప్రైవేటు కంపెనీకి ఇచ్చింది
  • పోలీసుల విచారణలో నిజాలు బయటకు వస్తాయి

తప్పు చేయకపోతే టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని వైసీపీ నేత మిథున్ రెడ్డి ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం వద్ద ఉండాల్సిన ప్రజల వివరాలను ప్రభుత్వం ప్రైవేటు సంస్థ ‘ఐటీ గ్రిడ్’కు అప్పగించిందని ఆరోపించారు. ఇది నిబంధనలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు టీడీపీ భారీ కుట్రకు తెరలేపిందని ఆరోపించారు. చంద్రబాబు చేతకానితనంతోనే తమపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందారెడ్డి ఓటును సైతం టీడీపీ నేతలు తొలగించారని మిథున్ రెడ్డి ఆరోపించారు. వివేకానందరెడ్డి స్వయంగా తన ఓటును తొలగించాలని ఆన్ లైన్ లో దరఖాస్తు చేసినట్లు చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కుటుంబ సభ్యుల ఓట్లే గల్లంతు అవుతుంటే ఇక సామాన్యుల సంగతి ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ పోలీసుల విచారణలో అన్ని నిజాలు బయటకు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.