Jagan: నాకో కల ఉంది... అది సీఎం కావడం కాదు: వైఎస్ జగన్

  • మరణించినా ప్రజల్లో గుర్తుండిపోవాలి
  • సీఎం పదవి కోసం పాకులాడటం లేదు
  • ప్రజలకు మరింత సంక్షేమాన్ని అందించాలన్నదే లక్ష్యం
  • ఇండియా టుడే కాన్ క్లేవ్ లో జగన్

తానేమీ ఏపీకి ముఖ్యమంత్రిని కావాలని కలలు కనడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. నిన్న ఇండియా టుడే కాన్ క్లేవ్ లో అతిథిగా పాల్గొన్న ఆయన, జర్నలిస్ట్ రాహుల్ కన్వల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూను ఇచ్చారు. తాను మరణించిన తరువాత కూడా ప్రజల్లో గుర్తుండిపోవాలన్నదే ప్రస్తుతం తాను కంటున్న కలని జగన్ వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి పదవి కోసం తాను పాకులాడటం లేదని తెలిపారు. అయితే, సీఎంగా ప్రజలకు మరింత సంక్షేమ పాలన అందించాలని ఉందని, అందుకు భగవంతుడి ఆశీస్సులను కోరుకుంటున్నానని చెప్పారు. ప్రస్తుత రాష్ట్ర పాలకుల్లో పారదర్శకత పూర్తిగా లోపించిందని ఆరోపించిన జగన్, 14 నెలల పాటు తాను ప్రజల మధ్యలో ఉన్నానని, వారికి ఏం కావాలో తెలుసుకున్నానని, తాను ఏం చేయాలో బోధపడిందని అన్నారు.

రాజకీయ నాయకుడిగా తన ప్రయాణం తొమ్మిదేళ్ల క్రితం మొదలైందని, తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ వచ్చానని, ఈ 9 సంవత్సరాలూ ఒక ఎత్తయితే, పాదయాత్ర ఒక ఎత్తని జగన్ అభివర్ణించారు. వీలైనంత ఎక్కువ మందిని కలుసుకుని, వారి ప్రేమను ఆస్వాదించానని అన్నారు.

రానున్న ఎన్నికల్లో అధికార పార్టీకి వ్యతిరేక ఫలితాలు రానున్నాయని సర్వేలు చెబుతున్న విషయాన్ని రాహుల్ కన్వల్ గుర్తు చేయగా, ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కొందరు వ్యక్తులు సృష్టించినవేనని, గత ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబునాయుడు, ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. విశ్వసనీయతను కోల్పోయిన చంద్రబాబును, ప్రజలు అంగీకరించే పరిస్థితి లేదని తెలిపారు.

రైతు రుణమాఫీ ఆచరణ సాధ్యం కాదని తెలిసి కూడా చేయనున్నామని చెప్పి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబని విమర్శలు గుప్పించారు. దీంతో వడ్డీలేని రుణాలను రైతులు కోల్పోయారని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వ లోపాలపై మాట్లాడుతూ వెళితే, అంతే ఉండదని అన్నారు.

రాహుల్, చంద్రబాబుల కలయికపై స్పందిస్తూ, జాతీయ స్థాయిలో ఉన్న రెండు పార్టీలు ఏపీని మోసం చేశాయని ఆరోపించారు జగన్. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వని కాంగ్రెస్, బీజేపీలకు తాము సమాన దూరంలో ఉన్నామని చెప్పారు. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఈ విభజన జరిగిందని చెప్పారు.

More Telugu News