Yogi Adityanath: ఈ మొత్తం సమస్యకు నెహ్రూనే కారణం: యోగి ఆదిత్యనాథ్ తీవ్ర ఆరోపణలు

  • పటేల్ విలీనం చేసిన ప్రాంతాలన్నీ ప్రశాంతంగా ఉన్నాయి
  • కశ్మీర్‌ను నెహ్రూ స్వయంగా రాజాహరిసింగ్‌కు అప్పగించారు
  • అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించిన మోదీ

జమ్ముకశ్మీర్‌లో ప్రస్తుత సంక్షోభానికి భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూనే కారణమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన ఆరోపణ చేశారు. 26/11 ముంబై దాడి తర్వాత అప్పటి యూపీఏ ప్రభుత్వం వ్యవహరించిన తీరు కూడా సరిగా లేదని దుమ్మెత్తిపోశారు.

500 సంస్థానాలను దేశంలో విలీనం చేయడంలో వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని, ఇందులో హైదరాబాద్, జునాగఢ్ కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పుడివన్నీ ప్రశాంతంగా ఉన్నాయని, అక్కడా ఎటువంటి సమస్యలు లేవని ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.

కశ్మీర్ విషయంలో నెహ్రూ వ్యవహరించిన తీరు ఏమాత్రం సరికాదని ఆదిత్యనాథ్ విమర్శించారు. నెహ్రూ తన చేతులతో తానే కశ్మీర్‌ను రాజాహరిసింగ్‌కు అప్పగించారని ఆరోపించారు. ఇప్పుడది బోల్డన్ని సమస్యలతో అల్లకల్లోలంగా ఉందని, 70 ఏళ్లుగా అది రగులుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రధాని నరేంద్రమోదీ లాంటి ‘నిర్ణయాత్మక నాయకత్వం’ ఉన్నచోట పరిస్థితులు వేరేలా ఉంటాయని సీఎం పేర్కొన్నారు. పాకిస్థాన్‌కు చిక్కిన భారత వింగ్ కమాండర్ అభినందన్ విషయంలో ఏమాత్రం రాజీలేకుండా అసాధ్యాన్ని సుసాధ్యం చేసి మరీ విడిపించుకుని రాగలిగారని ప్రశంసించారు.

More Telugu News