కాకినాడ ఎంపీ ఇంటికి జనసేన నేతలు.. పార్టీలోకి ఆహ్వానం!

03-03-2019 Sun 09:36
  • పార్టీలో చేరితే కోరుకున్న టికెట్
  • వీరవరం గ్రామానికి వచ్చిన జనసేన నాయకులు
  • జనసేనలో చేరాలని ఆహ్వానం
జనసేన పార్టీలో చేరితే తూర్పు గోదావరి జిల్లాలోని కోరుకున్న నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాన్ని కల్పిస్తామని పార్టీ అధినేత పవన్ కల్యాణ్, కాకినాడ ఎంపీ తోట నరసింహంకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. శనివారం నాడు కిర్లంపూడి మండలంలోని వీరవరం గ్రామానికి వచ్చిన పవన్ కల్యాణ్ రాయబారులు ఈ మేరకు నరసింహం కుటుంబ సభ్యులకు అధినేత మనసులో ఉన్న ఆలోచనను తెలియజేశారు.

పవన్ కు సన్నిహితులైన బ్రహ్మదేవ్ తో పాటు, పార్టీ రాష్ట్ర కోశాధికారి పంతం నానాజీ తదితరులు తోట ఇంటికి వచ్చారు. పవన్ ఆదేశిస్తేనే, తాము వచ్చామని, ఎక్కడి నుంచి పోటీ చేయాలని భావించినా, టికెట్ ఇచ్చేందుకు పవన్ సిద్ధమని వారు తెలిపారు.

కాగా, ఇటీవల సీఎం చంద్రబాబును కలిసిన తోట, కాకినాడ పార్లమెంట్ స్థానం తనకు వద్దని, ఎమ్మెల్యే సీటు కావాలని కోరిన సంగతి తెలిసిందే. మరోవైపు వైసీపీ కూడా తోట కుటుంబంపై కన్నేసింది. ఇటీవలే బొత్స సత్యనారాయణ, తోట ఇంటికి వెళ్లి మాట్లాడారు కూడా. ఈ నేపథ్యంలో పవన్ సైతం తోట ఫ్యామిలీని ఆహ్వానించాలని నిర్ణయించుకోవడంతో జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇక తోట నరసింహం మాత్రం అధికారికంగా ఎటువంటి నిర్ణయాన్నీ వెల్లడించలేదు.