పదేళ్ల బాలికను గర్భవతిని చేసిన పన్నెండేళ్ల బాలుడు.. నాలుగు నెలలుగా అత్యాచారం

03-03-2019 Sun 08:12
  • మహారాష్ట్రలోని పల్ఘర్‌లో ఘటన
  • కడుపులో నొప్పి వస్తుండడంతో విషయం వెలుగులోకి
  • పోక్సో చట్టం కింద కేసు నమోదు
మహారాష్ట్రలోని పల్ఘర్‌లో దారుణం జరిగింది. పన్నెండేళ్ల బాలుడు పదేళ్ల బాలికపై నాలుగు నెలలుగా అత్యాచారం చేస్తున్న దారుణ ఘటన వెలుగు చూసింది. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చడం కలకలం రేపుతోంది. శనివారం బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దారుణం బయటకొచ్చింది.

తనకు కడుపులో విపరీతంగా నొప్పి వస్తోందని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు కుమార్తెను ఆసుపత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె గర్భవతి అని చెప్పడంతో వారు నిర్ఘాంత పోయారు.

వైద్యులు చెప్పింది విని షాక్‌కు గురైన తల్లిదండ్రులు తేరుకుని ఏం జరిగిందంటూ బాలికను ప్రశ్నించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. తనపై ఓ కుర్రాడు నాలుగు నెలలుగా అత్యాచారం చేస్తున్నట్టు చెప్పడంతో గుండె పగిలినంత పనైన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, నిందితుడైన బాలుడిని ఇప్పటి వరకు అదుపులోకి తీసుకోలేదని తెలిపారు.

కాగా, ఇటీవల తమిళనాడులోనూ ఇటువంటి  ఘటనే ఒకటి వెలుగుచూసింది. బాలికపై అత్యాచారం చేసిన 12వ తరగతి విద్యార్థిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమె 8 నెలల గర్భిణి అని పోలీసులు తెలిపారు.